ప్రభాస్ - వర్మ... ఈ కాంబినేషన్ చూస్తామని కలలో అయినా అనుకొన్నామా? కానీ ఇది జరగబోతోంది. వర్మ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తాడో లేదో తెలీదు కానీ, ప్రస్తుతానికైతే ప్రభాస్ సినిమాలో వర్మ అయితే ఓ పాత్ర చేయబోతున్నాడు.
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా `ప్రాజెక్ట్ కె`. నాగ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున రూపొందిస్తోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉందని సమాచారం. ఆ పాత్ర కోసం రాంగోపాల్ వర్మని సంప్రదించింది చిత్రబృందం. అందులో నటించడానికి వర్మ ఓకే అన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో వర్మ ఓ సైంటిస్ట్ గా కనిపించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదో సైన్స్ ఫిక్షన్ అని, టైమ్ మిషన్ నేపథ్యంలో కథ సాగబోతోందని రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటిపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు చిత్రబృందం. కాకపోతే సీజీ వర్క్ కి చాలా ప్రాధాన్యం ఉందని సమాచారం. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. 2024లో ప్రాజెక్ట్ కె ప్రేక్షకుల ముందుకు వస్తోంది.