సలార్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో..అభిమానులంతా ఆనందోత్సహాల్లో ఉన్నారు. 2023 సెప్టెంబరు 28న ప్రభాస్ - సలార్ రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా యేడాదిపైనే సమయం ఉంది. అయినా సరే... నేడో మాపో సినిమా రిలీజ్ అన్నట్టు ఉత్సాహంలో ఉన్నారు రెబల్ ఫ్యాన్స్ సెప్టెంబరు 28 మంచి డేట్. ఎందుకంటే వరుసగా 5 రోజులు సెలవలు వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజు సినిమాకి 5 రోజులు సెలవులు రావడం కచ్చితంగా ప్లస్ పాయింటే.
అయితే సరిగ్గా సెప్టెంబరు 28నే హృతిక్ రోషన్ `ఫైటర్` సినిమా రిలీజ్ కానుంది. దీపికా పదుకొణె కథానాయికగా నటించింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు. ఇండియాలోనే తొలి ఏరియల్ యాక్షన్ సినిమాగా `ఫైటర్`ని రూపొందించారు. సలార్‌లానే ఫైటర్ కూడా పూర్తి స్థాయి యాక్షన్ సినిమానే. కాబట్టి.. రెండు చిత్రాలకూ మధ్య గట్టి పోటీ నెలకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సౌత్‌లో హృతిక్ కి అంత గిరాకీ లేదు. తన సినిమాలు పెద్దగా చూడరు. కాకపోతే.. బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ - హృతిక్ నువ్వా? నేనా అన్నట్టు తలపడే ఛాన్స్ ఉంది. సలార్ కంటే ముందే ఫైటర్ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఇప్పుడు సలార్ ని చూసి.. ఫైటర్ వెనకడుగు వేస్తాడా, లేదంటే ఫైట్ చేయడానికి రెడీ అవుతాడా? అనేది చూడాలి.