హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు హీరో ఫేస్ మీదనో, హీరోయిన్ ఫేస్ మీదనో కెమెరా ఫోకస్ వుంటుంది. అక్కడ హీరో, హీరోయిన్‌ని ఊహించుకుని రొమాన్స్ చేస్తున్నట్లుగా నటించాలి. అదే నటన అంటే. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో తెరకెక్కే సినిమాలకు ఎలాగూ ఈ ఊహ తప్పదు. సాధారణ సినిమాలకీ ఈ ఊహ తప్పనిసరి అంటున్నాడు ప్రభాస్. 'బాహుబలి' సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చిన ప్రభాస్, సినిమాలో కొండలు ఉండవు కదా, వాటిని ఎక్కుతున్నట్లు, అవి ఉన్నట్లు ఎలా ఊహించుకున్నారు? అన్న ప్రశ్నకు, నటన అంటేనే ఊహించుకుని చేయాలని సమాధానమిచ్చాడు. 'బాహబలి' సినిమా చిత్రీకరణలో నిజం కొండల్ని వాడలేదు. కానీ కొండల్ని ఎక్కినంత కష్టమూ మాకు తప్పలేదు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, కొండలు ఎక్కినట్లుగా చేశారు. అలా కష్టమైతే ఆ స్థాయిలోనే ఉంది అని ప్రభాస్ వివరించాడు. హీరో హీరోయిన్ల రొమాన్స్ విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ప్రభాస్ చెప్పాడని కాదుగానీ నటనలోని అద్భుతమే అది. హీరో హీరోయిన్లు ఇద్దరూ కనిపిస్తూ రొమాన్స్ చేయడం కష్టం కాకపోవచ్చు. కానీ హీరోయిన్ ఉందనే భావనతో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అంత తేలిగ్గా రావు. ఏదేమైనా సినిమా పట్ల డెడికేషన్ ప్రదర్శించే వ్యక్తుల్లో ప్రభాస్ కూడా ఒకడని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఎంత డెడికేషన్ లేకపోతే రాజమౌళి అడగ్గానే నాలుగేళ్ళపాటు మొత్తం డేట్స్‌ని ప్రభాస్ ఇచ్చేస్తాడు?