దేశంలోనే అత్యంత విలువైన, అత్యంత డిమాండ్ ఉన్న కథానాయకుడు ఎవరంటే... ప్రభాస్ పేరే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ అనే మాటకు అచ్చమైన నిర్వచనం.. ప్రభాస్. తనతో సినిమా చేయడానికి బాలీవుడ్ బడా సంస్థలు కూడా క్యూ కడుతున్నాయంటే.. ప్రభాస్ స్టామినాని అర్థం చేసుకోవొచ్చు. ప్రభాస్ చేతి నిండా సినిమాలే. మరో నాలుగేళ్ల వరకూ ప్రభాస్ కాల్షీట్లు ఖాళీగా లేవు. అయితే.. ఇప్పటికీ ప్రభాస్ కొత్త సినిమాలు ఒప్పుకుంటూనే ఉన్నాడు. తాజాగా మారుతితో ఓసినిమాకి ఓకే చెప్పాడు. చేతిలో ఉన్నసినిమాలే ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. అలాంటిది ఇన్ని సినిమాలు ఎలా ఓకే చేసేస్తున్నాడు? అనేదే అందరిలో మెదిలో ధర్మ సందేహం.
నిజానికి ప్రభాస్ దగ్గర స్ట్రాటజీ ఏం లేదు. దర్శకుడు, నిర్మాత.. ఎవరైనా సరే, తనకు నచ్చితే చాలు. సినిమా చేసుకో.. అంటూ అవకాశం ఇచ్చేస్తాడు. ప్రభాస్ - మారుతిల సినిమా కూడా ఇలానే సెట్టయ్యిందని టాక్. ప్రభాస్ తో సినిమా ఓకే అవ్వడం... మారుతినే నమ్మలేకపోతున్నాడు. ఆమధ్య మారుతి సరదాగా ప్రభాస్ ని కలిశాడని, మాటల మధ్యలో ఓ కథ చెప్పాడని, అది కూడా ప్రభాస్ ఒప్పుకుంటాడన్న ఉద్దేశ్యంతో కాదని, అయితే మారుతితో ఉన్న చనువు, స్నేహం కొద్దీ.. ఆ కథ విన్నాడని, ప్రభాస్ కి నచ్చి ఓకే చెప్పేశాడని, ప్రభాస్ ఓకే అనడం మారుతి కూడా నమ్మలేకపోయాడని తెలుస్తోంది.
కేవలం మూడంటే మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తాడనన్ నమ్మకంతోనే ఈ ప్రాజెక్టుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రభాస్ చేస్తున్నవన్నీ భారీ సినిమాలే. ఒక్కో సినిమాకీ ఏడాది పడుతోంది. అలా కాకుండా మధ్యమధ్యలో ఇలాంటి చిన్న సినిమాలు చేస్తుంటే.. అటు డబ్బులూ వస్తాయి, తనని నమ్ముకున్న నిర్మాతల్నీ, దర్శకుల్నీ నిలబెట్టినట్టు అవుతుంది. ఇదే ప్రభాస్ స్ట్రాటజీ. ఇంతకు మించి ప్రభాస్ కూడా ఏం ఆలోచించడం లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.