తెలగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయాలంటే.. సినీ గ్లామర్ తప్పని సరి. అందునా.. ఎన్నికల ప్రచార సమయంలో వాళ్లు కూడా భాగ స్వాములు అవ్వాల్సిందే. అధికార, ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇస్తూ.. అప్పుడే కొంతమంది సీనీ స్టార్లు గొంతు విప్పుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ కూడా ఈ జాబితాలో చేరాడు.
ప్రకాష్‌రాజ్ గత కొంతకాలంగా ప్రజా సమస్యలకు స్పందిస్తూ, కొన్ని పార్టీల తీరుని బహిరంగంగానే ఎండగడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి ప్రతికూలంగా ఆయన కొన్ని స్టేట్‌మెంట్లు కూడా చేశారు. బహిరంగ చర్చల్లో పాలుపంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల పరంగా పొలిటికల్‌గా ఆయన స్టాండ్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
తెలంగాణ వరకూ ఆయన సపోర్ట్ టీ.ఆర్.ఎస్‌కే. ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు కూడా. తెలంగాణలో పోటీ చేస్తున్న మహా కూటమిపై ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 15 సీట్లతో ఏం చేస్తారని, కాంగ్రెస్ అభ్యర్థి సీఎం అయితే.. తెలంగాణ ప్రజలకు ఒనగూరేది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ విషయంలో మాత్రం ఆయన ఆచి తూచి స్పందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఇంకా తన విధానాలను ప్రకటించలేదని, ఓ వ్యక్తిగా, లీడర్‌గా ఆయన్ని ఇష్టపడతానని, విధివిధానాలు ప్రకటించాకే.. ఏపీ విషయం గురించి మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ తీరు చూస్తుంటే.. ఏపీలో ఆయన జనసేనకే సపోర్ట్ చేసేట్టు కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?