కన్నడ చిత్రసీమలో `మీటూ` సెగలు రేపుతోంది. ఈ వివాదం అక్కడ యాక్షన్‌కింగ్ అర్జున్ - శ్రుతిహరిహరన్ మధ్యనే కేంద్రీకృతమైంది. `ఫోర్ ప్లే చేద్దామా` అని అర్జున్ తనని అడిగాడని శ్రుతిహరిహరన్ ఓ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.
దీనిపై న్యాయ పోరాటానికి అర్జున్ సిద్ధమయ్యాడు. శ్రుతికి కొంతమంది మద్దతు తెలిపితే - అర్జున్ కి బాసటగా మరికొంతమంది నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కన్నడ సీమలో దుమారాన్ని రేపాయి. తన వ్యాఖ్యలు శ్రుతి హరిహరన్‌కి మద్దతు తెలిపేలా ఉండడమే కాకుండా, అర్జున్‌ని దోషిలా నిలబెడతున్నాయని కొంతమంది ప్రకాష్ రాజ్‌పై విరుచుకుపడుతున్నారు. తోటి నటుడికి తోడ్పాటు ఇచ్చే పద్ధతి ఇదేనా? అని ప్రకాష్‌రాజ్‌ని నిలదీస్తున్నారు.
దాంతో ప్రకాష్ రాజ్ దిగి వచ్చాడు. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నాడు. తను అర్జున్‌కి వ్యతిరేకంగా మాట్లాడలేదని, అసలు ఈ వివాదంలో తను ఎవరి పక్కనా లేదని, మధ్యవర్తిగా మాట్లాడానని, అర్జున్‌పై తనకు చాలా గౌరవం, నమ్మకం ఉన్నాయని, అర్జున్ - శ్రుతి ఇద్దరూ ఓ రాజీకి వచ్చి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలనే కోరుకుంటున్నానని ప్రకాష్ రాజ్‌చెప్పుకొచ్చాడు.
అర్జున్ - శ్రుతి మధ్య రాజీ కుదిర్చి - ఈ ఎపిసోడ్‌కి పుల్ స్టాప్ పెట్టాలని కన్నడ చిత్రసీమ భావిస్తోంది. అందుకోసం ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగవచ్చని సమాచారం.