`మా` ఎన్నికలు ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. ఓవైపు ప్రకాష్ రాజ్, మరోవైపు విష్ణు నువ్వా? నేనా? అంటూ పోటీ పడుతున్నారు. `మా భవనానికి అవసరయ్యే ఖర్చంతా నేనే భరిస్తా` అంటూ ఇటీవల విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వంతు వచ్చింది. `మా భవనానికి అవసరమయ్యే ఎకరం భూమిని నేను సంపాదించి ఇస్తా` అంటున్నాడు ప్రకాష్ రాజ్. `మా` భవనానికి తగిన స్థలం కేటాయించాలని చాలా ఏళ్లుగా `మా` శ్రమిస్తోంది. ప్రభుత్వాలు మారినా.. `మా` స్థలం కోసం ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఈ సమస్య ఏళ్ల తరబడి నలుగుతూనే ఉంది. మా భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు భరిస్తా అని విష్ణు ముందుకు రావడంతో, ఇప్పుడు భూమినే అసలు సమస్యగా మారింది.
ఇప్పుడు ఆ భూమిని ప్రకాష్ రాజ్ సాధించగలరా? అనేదే ప్రధాన ప్రశ్న. ప్రభుత్వంలోని పెద్దలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఎలాగైనా సరే, ఎకరం భూమిని సంపాదిస్తానని ప్రకాష్ రాజ్ గట్టిగా చెబుతున్నారు. అయితే... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరం భూమి సంపాదించడం చాలా క్లిష్టమైన పని. ఫిల్మ్‌నగర్ ఏరియాలో ఎకరం భూమి అంటే వేల కోట్లతో సమానం. ఒకవేళ ప్రభుత్వం భూమి ఇచ్చినా అది 2 వేల గజాలకు మించి ఉండదు. ఎకరం భూమి కావాలంటే.. సిటీ అవుట్ కట్స్ లో ఇవ్వొచ్చు. అలా ఇస్తే.. అక్కడ భవనం కట్టడానికి `మా` సిద్ధంగా ఉంటుందా? అనేది మరో ప్రశ్న. ఈ మేటర్ ఇప్పట్లో తేలేలా లేదు మరి.