`మా`లో ఎన్నికల వేడి రాజుకుంది. మా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. `లేచింది లేడికి పరుగు` అన్నట్టు... ఇప్పుడే ఎన్నికల ప్రచారాలు, ప్రకటనలు, వాగ్దానాల హడావుడి కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య ఈసారి గట్టి పోటీ ఏర్పడింది. వీరిద్దరిలో ఎవరో ఒకరు గెలవొచ్చు.. అన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మధ్యలో జీవిత ఇచ్చే కాంపిటీషన్ నీ తక్కువగా చూడకూడదు.
అయితే ప్రకాష్‌రాజ్ ని ఓడించడానికి ప్రత్యర్థులు అప్పుడే అస్త్రాలు సిద్ధం చేసేశారు. ప్రకాష్ రాజ్ టైమ్ కి సెట్ కే రాడని, అలాంటిది ఇలాంటి వ్యవహారాలకు సమయం ఎక్కడ కేటాయిస్తాడంటూ కార్నర్ చేస్తున్నారు. అంతే కాదు. `నాన్ లోకల్` ఇష్యూ కూడా తీసుకొచ్చారు. ప్రకాష్ రాజ్ తెలుగువాడు కాదు. కన్నడీగుడు. అలాంటి వ్యక్తిని `మా`లో చోటెక్కడ ఇస్తాం? అంటూ నిలదీస్తున్నారు.
దీనిపై ప్రకాష్ రాజ్ కూడా సూటిగానే స్పందించారు. తనని ఓడించడానికే నాన్ లోకల్ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారని, గత ఎన్నికలలో లేని లోకల్ - నాన్ లోకల్ గొడవ ఇప్పుడెందుకు వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ``ఏడు నందులొచ్చాయి. జాతీయ అవార్డులు వచ్చాయి. రెండు గ్రామాలను దత్తత తీసుకున్నా. నా సహాయకులందరికీ ఇల్లు కట్టించా. అప్పుడు లేని నాన్ లోకల్ .. ఇప్పుడు ఎందుకు వచ్చింది?`` అని ప్రకాష్ రాజ్ అడుగుతున్నారు. కళాకారులకు ఈ ఫీలింగ్ ఉండకూడదని, తామంతా యూనివర్సల్ అని ప్రకటించారు ప్రకాష్ రాజ్. ఆ విధంగా ఈ విమర్శల్ని ప్రకాష్ రాజ్ గట్టిగానే తిప్పికొట్టినట్టైంది.