ప్ర‌కాష్‌రాజ్‌కి సెల్యూట్‌.. రాజ‌శేఖ‌ర్‌కి స‌లామ్‌!

By Gowthami - March 23, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఎక్క‌డ‌వాళ్లంతా అక్క‌డ గ‌ప్ చుప్ అయిపోయారు. చిత్ర‌సీమకి తాత్కాలికంగా తాళాలు ప‌డ్డాయి. మ‌ళ్లీ ఎప్పుడు షూటింగుల హ‌డావుడి మొద‌ల‌వుతుందో తెలీదు. ఈనెల 31 వ‌ర‌కూ క‌ర్ఫ్యూలాంటి ప‌రిస్థితే. అంద‌రూ ఇంట్లోనే ఉండాలి. పెద్ద పెద్ద హీరోల‌కూ, ల‌క్ష‌లు సంపాదించే క‌థానాయిక‌ల‌కు, కోట్లాది రూపాయ‌లు వెన‌కేసుకున్న నిర్మాత‌ల‌కూ ఈ ప‌ది రోజుల నిర్బంధం ఏమాత్రం బాధ క‌లిగించ‌దు. పైగా ఇంట్లోవాళ్ల‌తో క‌లిసి ఉండ‌డానికి ఇదో అవ‌కాశం.

 

కానీ.. సినిమాల‌పైనే ఆధార‌ప‌డుతూ, సినిమాల‌పైనే బతుకుతున్న రోజువారి కార్మికుల‌కు మాత్రం ఇదో విష‌మ ప‌రీక్ష‌. మ‌ళ్లీ షూటింగులు మొద‌లైతే గానీ, వాళ్ల క‌డుపు నిండ‌దు. మ‌రి అలాంటి వాళ్ల ప‌రిస్థితేంటి? ప్ర‌కాష్ రాజ్ ఇదే ఆలోచించాడు. త‌న సిబ్బందికి మే నెల జీతాన్ని సైతం ముందుగానే చెల్లించి సెహ‌భాష్ అనిపించుకున్నాడు. త‌న సినిమాల‌కు ప‌నిచేయాల్సిన కార్మికుల వివ‌రాలు తెలుసుకుని, వాళ్ల‌కు సైతం స‌గం జీతాన్ని ముందుగానే అందించాడు.

 

రాజ‌శేఖ‌ర్ మ‌రో అడుగు ముందుకు వేశాడు. రెక్కాడితే గానీ, డొక్కాడ‌ని సినీ కార్మికుల కోసం ప‌ది రోజుల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని ప్యాక్ చేసి ఉంచాడు. కావ‌ల్సిన వాళ్లు ఒక్క ఫోన్ నెంబ‌ర్ చేయండి అంటూ పిలుపు నిచ్చాడు. `మా` లాంటి సంస్థ‌లు చేయాల్సిన ప‌ని ఇది. తానొక్క‌డే సంస్థ‌లా మారి, ముందు కొచ్చి సాయం చేస్తున్నాడు. వీరిద్ద‌రి దారిలో మ‌రింత‌మంది హీరోలు ప‌య‌నిస్తే... త‌ప్ప‌కుండా సినీ కార్మికుల ఆక‌లి వెత‌లు తీర‌తాయి. మ‌రి ఆ దిశ‌గా ఎంత‌మంది న‌డుస్తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS