నృత్య దర్శకుడిగా, నటుడిగా, హీరోగా, దర్శకుడిగా భిన్నమైన కోణాల్ని చూపించాడు లారెన్స్. ఇప్పుడు సమాజసేవపై కూడా దృష్టి పెట్టాడు. ఈ విషయంలో రజనీకాంత్‌ని ఆదర్శంగా తీసుకున్నాడు. రజనీ నాకు దేవుడు.. అని చాలాసార్లు చెబుతుంటాడు లారెన్స్. రజనీ నటించిన కొన్ని చిత్రాలకు కొరియోగ్రఫీ కూడా అందించాడు. ఇప్పుడు రజనీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడని కోలీవుడ్ టాక్. అవును.. లారెన్స్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేయబోతున్నాడని తమిళ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
రజనీ వీలైనంత త్వరగా, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాడు. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు.. కొన్ని సినిమాల్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అందులో భాగంగా కొత్త కథలు వింటున్నాడు. లారెన్స్ కూడా ఇటీవల ఓ కథ వినిపించినట్టు తెలుస్తోంది. ఆ కథకు రజనీ కూడా ఓటేశాడట. రజనీ సినిమాకి దర్శకత్వం వహించాలన్నది లారెన్స్ ఆశ. అది ఇప్పటికి తీరింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రానుంది.