కేజీఎఫ్‌తో దక్షిణాదినే కాదు, టోటల్ గా ఇండియన్ సినిమా దృష్టినే తన వైపుకు తిప్పుకునేలా చేశాడు ప్రశాంత్ నీల్. తనతో సినిమా చేయడానికి మన హీరోలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్. ఎన్టీఆర్, చరణ్... ఇలా అందరితోనూ టచ్‌లో ఉన్నాడు ప్రశాంత్. చివరికి ప్రభాస్ కి కథ చెప్పి, ఓకే చేయించుకున్నాడు.
ఆది పురుష్ తరవాత.. ప్రభాస్ చేయబోయే సినిమా ఇదే అని టాక్ నడుస్తోంది. అయితే.. ఇది `ఉగ్రమ్` అనే సినిమాకి రీమేక్ అట. 2014లో కన్నడలో విడుదలైన చిత్రమిది. అక్కడ సూపర్ హిట్. ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా తన తడాఖా చూపించాడు. కేవలం 4 కోట్లతో రూపొందించిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆ కథనే... ప్రభాస్ తో రీమేక్ చేయబోతున్నాడట. `ఉగ్రమ్` కథ ప్రభాస్ కి బాగా నచ్చిందని, అందుకే ఈ కథనే రీమేక్ చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడని, ప్రశాంత్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ప్రభాస్ తో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకోవడం కష్టం. అందుకే రిస్క్ లేకుండా రీమేక్ ని ఎంచుకున్నార్ట. ఉగ్రమ్ బదులుగా కొత్త కథని ఎంచుకుంటే బాగుండేదన్నది సినీ విశ్లేషకుల మాట. ఎందుకంటే ఎప్పుడో 2014లో వచ్చిన సినిమా అది. దాన్ని రీమేక్ చేయడం అంటే తెలిసిన కథే మళ్లీ చెప్పడం అన్నమాట. అందులో కిక్ ఏముంటుంది చెప్పండి? మరి ప్రభాస్ ఎందుకు రీమేక్ వైపు మొగ్గు చూపించాడో?