డిసెంబరు 12.... రజనీకాంత్ అభిమానులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. అది రజనీ పుట్టిన రోజు. ఆరోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటారు. రజనీ కొత్త సినిమాకి సంబంధించిన టీజరో, ట్రైలరో, పోస్టరో విడుదల చేయడం ఆనవాయితీ. ఈ డిసెంబరు 12న అంతకు మించిన విశేషాలే దర్శనమివ్వబోతున్నాయన్నది తమిళ నాట టాక్.
రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి ఏళ్లకు ఏళ్లుగా అక్కడ చర్చ జరుగుతోంది. అదిగో.. ఇదిగో అనడం మినహాయిస్తే రజనీ నుంచి ఎలాంటి కదలిక లేదు. అయితే ఈ డిసెంబరు 12న రజనీ రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. ఈరోజు రజనీకాంత్ తన అభిమాన సంఘం తో ఓ భేటీ ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల పాటు.. ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాజకీయ ప్రవేశం గురించిన చర్చ జరిగిందని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చే విషయమై... రజనీ కూలంకుశంగా చర్చిస్తున్నట్టు భోగట్టా. ఈ చర్చల అనంతరం.. రజనీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. అయితే.. ప్రతీ యేటా తన అభిమాన సంఘ నాయకులతో చర్చలు జరపడం రజనీకి అలవాటే. ఈసారి అంతేనని, అందులో విశేషం ఏమీ లేదని మరోవాదన కూడా వినిపిస్తోంది. రయితే ఆశావాహులు మాత్రం... ఈసారి రజనీ రాజకీయ ప్రవేశం గ్యారెంటీ అంటున్నారు. ఊరించీ, ఊరించి ఉసూరుమనిపించడం రజనీకి ఎలాగూ అలవాటే కాబట్టి... అదే జరుగుతుందని ఇంకో వర్గం వాదన. ఎవరి జోస్యం ఫలిస్తుందో చూడాలి.