మొదటి సినిమా 'అ!' తోనే అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన 'కల్కి' ఆశించిన విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ కరోనా వైరస్ నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ ఆసక్తికరమైన విశయాలు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలోనే 'క్వీన్' తెలుగు రీమేక్ డైరెక్షన్ క్రెడిట్ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
'కల్కి' తర్వాత ప్రశాంత్ వర్మ 'దట్ ఈజ్ మహాలక్ష్మి' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ హిట్ సినిమా 'క్వీన్' కు ఈ సినిమా రీమేక్. అయితే ఈ సినిమా పోస్టర్లలో ఎక్కడా ప్రశాంత్ వర్మ పేరు లేదు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఈ సినిమా సగం పూర్తైన తర్వాత దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నానని, అందుకే డైరెక్షన్ క్రెడిట్ తీసుకోలేదని అన్నారు. నిర్మాతల కోసం సినిమా పూర్తి చేశానని, క్రెడిట్ కోసం ఆలోచించలేదని అన్నారు.
ఈ సినిమాకు మొదట నీలకంఠ దర్శకత్వం వహించారు. అయితే సగం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా నుండి తప్పుకుని 'క్వీన్' మలయాళం రీమేక్ బాధ్యతలు చేపట్టారు. అయితే 'దట్ ఈజ్ మహాలక్ష్మి' పోస్టర్ల మీద ప్రశాంత్ వర్మ పేరే కాదు, నీలకంఠ పేరు కూడా లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా చాలా రోజుల నుంచి రిలీజుకు నోచుకోలేదు.