పలు వాయిదాల అనంతరం 2.ఓ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి పాజిటీవ్ టాకే లభించింది. తొలి రోజు వసూళ్లు కూడా బాగున్నాయి. అయితే ఈ వసూళ్ల విషయంలో అటు చిత్రబృందం గానీ, ఇటు బయ్యర్లు గానీ సంతృప్తితో లేరని సమాచారం. ఎందుకంటే.. దాదాపు ఆరొందల కోట్లతో రూపొందించిన చిత్రమిది. థియేటరికల్ రైట్స్ రూ.300 కోట్లకు అమ్ముడుపోయాయి. తొలి రోజు దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.68 కోట్ల వసూళ్లు వచ్చాయి.
పెట్టుబడితో పోలిస్తే... తొలిరోజు వచ్చిన షేర్ చాలా తక్కువ. రోజు రోజుకీ వసూళ్లు తగ్గుతాయి తప్ప, పెరిగే అవకాశం లేదు. పెట్టుబడి రాబట్టుకోవాలంటే ఈ కలక్షన్లు ఉధృతంగా పెరగాల్సిన అవసరం ఉంది.కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఆ అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి. తొలిరోజు 2.ఓ బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందని చిత్రబృందం ఆశించింది. కానీ... అలాంటిదేం జరగలేదు.
తమిళనాట ఈ చిత్రానికి రూ.14 కోట్ల వసూళ్లు దక్కాయి. ఇది కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో ఈ సినిమాని భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పుడు భయపడుతున్నారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప, పిల్లల కోసం పెద్దలు మరోసారి ఈ సినిమాకి వస్తే తప్ప... బయ్యర్లు సేఫ్‌గా బయటపడరని ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు గడుతున్నారు.