హ్యాపీడేస్‌, అర్జున్ రెడ్డి... ఓ హిట్ల‌ర్‌

By iQlikMovies - September 21, 2021 - 13:02 PM IST

మరిన్ని వార్తలు

దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే ఎన్నో అంచ‌నాలుంటాయి. దిల్ రాజు ఆ అంచ‌నాల్ని చాలా వ‌ర‌కూ నిల‌బెట్టుకున్నాడు కూడా. చిన్న సినిమాల విష‌యంలో ఆయ‌న మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటాడు. స్టార్లు లేన‌ప్పుడు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తోనే ఓ అటెన్ష‌న్ క్రియేట్ చేస్తుంటాడు. దిల్ రాజు నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది. అదే... `రౌడీ బాయ్స్‌`. దిల్‌రాజు సోద‌రుడు శిరీష్ వాళ్ల అబ్బాయి అశిష్ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న సినిమా ఇది. కాబ‌ట్టే.. ఆ ఫోక‌స్ ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. దేవిశ్రీ ప్ర‌సాద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తో పాడింగ్ బాగానే కుదిరింది. ప్ర‌మోష‌న్లు కూడా గ‌ట్టిగా చేస్తున్నారు. ఇప్పుడు ఓ టీజ‌ర్ వ‌దిలారు.

 

టీజ‌ర్ చూస్తేనే రౌడీ బోయ్స్ కథాక‌మామిషూ అర్థ‌మైపోతోంది. ఇందులో హ్యాపీడేస్ ఫ్లేవ‌ర్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఓ అమ్మాయి కోసం ఇద్ద‌రు కుర్రాళ్ళ‌ వాదులాట ఇది. `ఆ పిల్ల నాది..` అంటే `ఆ పిల్ల నాది` అంటూ కొట్టుకుంటుంటారు. అదేమో అర్జున్ రెడ్డిని గుర్తుకు తెచ్చేలా ఉంది. ఈ టీజ‌ర్ లో ఓ డైలాగ్ ఉంది. `ఎప్పుడు చూడూ మా కాలేజీ అమ్మాయిల వెంట ప‌డ‌తారేంటి మీ కాలేజీలో అమ్మాయిల్లేరా` అంటే.... `మీ కాలేజీలో మ‌గాళ్లు లేరు` అంటూ కౌంట‌ర్ ఇచ్చే డైలాగ్. సినిమాల్లో హైలెట్ అన‌ద‌గ్గ డైలాగ్ నే టీజ‌ర్లో ఉంచుతారు. ఈ డైలాగ్ త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని హీరో చాలాసార్లు చెప్పాడు. అయితే ఇది `హిట్ల‌ర్‌`లోని డైలాగ్ కి కాపీ. అలా.... ఒకే టీజ‌ర్‌లో మూడు సినిమాల ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. సినిమా మొత్తం చూస్తే ఇంకెన్ని సినిమాలు గుర్తొస్తాయో ఏంటో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS