లాక్ డౌన్ సమయంలో... ఓటీటీలే పెద్ద దిక్కుగా మారాయి. వెండి తెర లేని లోటుని తీర్చేశాయి. ఓ రకంగా చిత్రసీమని ఓటీటీలు కాపాడాయి. నిర్మాతలు తమ సినిమాల్ని అమ్ముకోవడానికి ఓ వేదిక కల్పించింది. ఓటీటీల గురించి తెలియని వాళ్లు సైతం... కొత్త సినిమాల కోసం వినియోగదారులుగా మారిపోయారు. ఇప్పటికీ థియేటర్ల వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది. చాలా సినిమాలు ఓటీటీల వైపు చూస్తున్నాయి.
అయితే ఇటీవల థియేటర్లు మళ్లీ తెరచుకున్నా - జనాలు రావడం లేదు. శ్రీదేవి సోడా సెంటర్, సిటీమార్ లాంటి సినిమాలకూ ప్రేక్షకులు కరువయ్యారు. అందరూ.. ఇది కరోనా భయంతోనే అని డిసైడ్ అయిపోతున్నారు. నిజానికి కరోనా భయం కంటే, ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోవడం వల్లే థియేటర్లకు రావడం లేదన్నది విశ్లేషకుల మాట. గత ఏడాదిగా ప్రేక్షకులంతా ఓటీటీలపై ఆధారపడిపోయారు. ఇంట్లోనే సినిమా చూడడం అలవాటైంది. థియేటరికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం తహతహలాడడం లేదు. కాస్త ఆలస్యమైనా ఓటీటీలో సినిమా వస్తుందిలే... అని లైట్ తీసుకుంటున్నారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన టక్ జగదీష్ కి నెగిటీవ్ రిపోర్ట్ వచ్చాయి. ఈ సినిమా మరో బ్రహ్మోత్సవం అని జోకులు వేసుకున్నారంతా. అయితే అమేజాన్‌లో ఈ సినిమా రికార్డ్ వ్యూస్ సాధించింది. మాస్ట్రో కూడా అంతే. నితిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. ఈసినిమా హాట్ స్టార్ లో ఉంది. ఈ సినిమాతో హాట్ స్టార్‌కి వెళ్లే వినియోగ దారుల సంఖ్య గణణీయంగా పెరిగిందని సమాచారం. ఇవే సినిమాలు థియేటర్లో వస్తే. జనం చూసేవాళ్లే కాదు. కానీ ఓటీటీలో మాత్రం హోస్ ఫుల్. దాన్ని బట్టి చూస్తుంటే జనాలు ఓటీటీ మత్తులో పడిపోయారన్న సంగతి అర్థమవుతోంది. ఇక నుంచి.. బడా స్టార్ల సినిమాలూ ఓటీటీలోనే రిలీజ్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.