చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎవరైనా వద్దంటారా? ఎగిరి గంతేసి మరీ ఆ అవకాశాన్ని రాబట్టుకుంటారు. కానీ ఓ దర్శకుడు మాత్రం `సారీ` చెప్పాడు. అతనే ఫృథ్వీరాజ్. మలయాళంలో పృథ్వీ నయా సూపర్ స్టార్. తను దర్శకుడు కూడా. మోహన్ లాల్ తో `లూసీఫర్` తీశాడు. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో చిరంజీవి `గాడ్ ఫాదర్` పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకుడు. అయితే లూసీఫర్ తీసిన... పృథ్వీరాజ్‌నే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించమని చిరంజీవి అడిగార్ట. కానీ.. పృథ్వీరాజ్ `నో` చెప్పాడు. దానికీ కారణాలున్నాయి. మలయాళంలో ఫృథ్వీరాజ్ ఫుల్ బిజీ. తన చేతిలో పెద్ద పెద్ద సినిమాలున్నాయి. అందుకే ఈ ఆఫర్ ని వదులుకోవాల్సివచ్చింది.
``చిరంజీవి గారంటే నాకు చాలా అభిమానం. ఆయన స్వయంగా పిలిచి.. డైరక్షన్ ఛాన్స్ ఇచ్చినా చేయలేకపోయా. ఈ విషయంలో ఇప్పటికీ బాధ పడుతుంటాను. కానీ లూసీఫర్‌ని ఆయన తెలుగులో తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. మోహన్ లాల్ పాత్రకు ఆయనే కరెక్ట్. ఈ కథని ఆయన నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తారని నమ్మకం ఉంది`` అన్నాడు ఫృథ్వీరాజ్. లూసీఫర్ కి సీక్వెల్ తీయడానికి ఫృథ్వీరాజ్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈసినిమా హిట్టయితే.. తెలుగులో దాన్ని చిరంజీవినే రీమేక్ చేస్తార్ట. అప్పుడు మాత్రం దర్శకత్వం చేయమని తనని సంప్రదిస్తే... ఆ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోను అంటున్నాడు ఫృథ్వీరాజ్.