ప్రియానంద్ గుర్తుందా? శేఖర్ కమ్ముల సినిమా `లీడర్`లో మెరిసింది. ఆ తరవాత శర్వానంద్ లాంటి యువ హీరోలతో నటించింది. పెద్దగా గుర్తింపు రాలేదు. అడపా దడపా సినిమాలు చేసినా ఆమెను పట్టించుకోలేదు. ఇప్పుడు వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. `మా నీళ్ల ట్యాంకర్` అనే వెబ్ సిరీస్‌లో నటించింది ప్రియానంద్. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
తన పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తే నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకుంటా అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఆయన క్రేజ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుందని, ఆయనపై ఇన్ని వివాదాలు ఉన్నా, వేలాదిగా భక్తులు తరలివస్తుంటారని, తన పేరులో కూడా `ఆనంద్` ఉంది కాబట్టి... నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకొన్నా.. పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని హాట్ కామెంట్లు చేసింది.
ఇదంతా.. పబ్లిసిటీ కోసం చేసిందా, సరదా కోసం అనేసిందా? లేదంటే నిజంగానే నిత్యానంద స్వామిపై ఇష్టం పెంచుకొందా? అనేది... ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిత్యానంద స్వామిపై ఎన్ని వివాదాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనపై చాలా కేసులున్నాయి. దాంతో కొంతకాలంగా నిత్యానంద ఆజ్ఞాతంలోనే గడుపుతున్నారు.