ఈమధ్య థియేటర్లు మూతపడి ఉండడం, ఓటీటీ వేదికలకు ఆదరణ పెరగడంతో చాలామంది ఇక థియేటర్లకు గడ్డుకాలమే అనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఫ్యూచర్లో థియేటర్లకు జనాలు రారని కూడా తీర్మానిస్తున్నారు. అయితే ఈ అంశంపై 'టాక్సీవాలా' నిర్మాత ఎస్కేయన్ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి.
ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సినిమా ఇండస్ట్రీకి ఏమీ కాదని, జనాలు థియేటర్లకు వెళ్లడం మానరు అని చెప్తున్నారు. థియేటర్లు మూసి ఉండడంతో ఓటీటీల కారణంగా నిర్మాతలకు కొంత ఊరట లభించడం మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీని కారణంగా జనాలు థియేటర్లకు వెళ్లడం మానేస్తారు అనేది నేను నమ్మనని చెప్పారు. గతంలో వీసిఆర్లు, టీవీలు పాపులర్ అయిన కొత్తలో ఇలాంటి అభిప్రాయమే వినిపించిందని, అయితే జనాలు థియేటర్లకు వెళ్లడం మానలేదని చెప్పారు. ఇప్పుడు ఓటీటీలు, ఎటీటీలు వచ్చాయి. వీటికి ఆదరణ లభించినా థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు సాటి లేదన్నారు. సినిమా అనేది మన కల్చర్ అని, థియేటర్ కు వెళ్లి చూడడం అనేది ఓ ఎమోషన్ అని ఎస్కేయన్ అన్నారు.
ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ సాయి రాజేష్ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. మారుతి పర్యవేక్షణలో ఒక వెబ్ సీరీస్ నిర్మిస్తున్నానని, ఇది ఓ ప్రముఖ ఓటీటీ వేదిక కోసం రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇవి కాకుండా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా ఆయన 'శ్యామ్ సింగరాయ్' పూర్తి చేసిన తర్వాత ఉంటుందని చెప్పారు.