చిరంజీవి - కె.ఎస్.రామరావులది విజయవంతమైన కాంబినేషన్. మరణమృదంగం, రాక్షసుడు, అభిలాష, ఛాలెంజ్ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే కొంతకాలంగా చిరంజీవికీ ఆయనకూ గ్యాప్ వచ్చిందని, ఇండ్రస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఇప్పుడు కె.ఎస్.రామారావు వ్యాఖ్యలతో అది నిర్దారణ కూడా అయ్యింది. చిరంజీవి తాజా చిత్రం `భోళా శంకర్`కి ఆయన ఒకానొక నిర్మాత. ఈ రోజే భోళా శంకర్ సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సందర్భంగా చిరుతో గ్యాప్ విషయంలో సంచలన కామెంట్స్ చేశారు కె.ఎస్.రామారావు.
''చిరంజీవితో మళ్లీ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మా ఇద్దరి మధ్యా అనుకోని గ్యాప్ వచ్చింది. దానికి ఓరకంగా మా పాత్రికేయ మిత్రులు కూడా కారణం. మెహర్, అనిల్ సుంకర ఇద్దరూ కలిసి చిరంజీవితో నాకో సినిమా చేసే అవకాశం కల్పించారు. చాలా ఏళ్ల తరవాత ఇది నా జీవితంలోనే మధురమైన రోజు.. తప్పకుండా ఓ మంచి సినిమా తీస్తాం'' అన్నారు కె.ఎస్.రామారావు. నిజానికి.. రామ్ చరణ్ తో కె.ఎస్.రామరావు ఓ సినిమా చేయాల్సింది. మెగా ఫ్యామిలీలో సినిమా చేయాలన్న కోరిక.. మళ్లీ ఇన్నాళ్లకు కె.ఎస్.రామారావుకి ఇలా తీరింది.