బాహుబలి, కేజీఎఫ్ రెండు భాగాలుగా వచ్చి దుమ్ము దులిపాయి. కాంతారా రెండో భాగం సిద్ధం అవుతోంది. పీఎస్1కి కొనసాగింపుగా పిఎస్ 2 వస్తోంది. పుష్ప ది కూడా అదే దారి. ఇప్పుడు.. ప్రాజెక్ట్ కె సైతం రెండు భాగాలుగా రాబోతోందని ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ - నాగ అశ్విన్ కాంబినేషన్‌లో అశ్వనీదత్ భారీ వ్యయ ప్రయాసలతో రూపొందిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారని తొలి భాగం 2024 ఏప్రిల్ లో విడుదల అవుతుందని, రెండో భాగం 2025 ఏప్రిల్ లోకి తీసుకొస్తారని సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని దాదాపుగా 400 కోట్ల భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. భారతీయ చలన చిత్రసీమలో ఇంత వరకూ రాని పాయింట్, కన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. అసలు ఈ సినిమా థీమ్, జోనర్ విచిత్రంగా ఉంటాయని తెలుస్తోంది. అయితే.. రెండు భాగాల విషయంపై చిత్రబృందం ఇప్పటి వరకూ స్పందించలేదు. త్వరలోనే దీనిపై ఓ అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.