మణిరత్నం కలల సినిమా `పొన్నియన్ సెల్వన్`. ముఫ్ఫై ఏళ్ల నుంచీ ఈసినిమా తీయాలని కలలు కంటూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఈ సినిమా పూర్తయి, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే డివైడ్ టాక్.. ఊపేసింది. తమిళ ప్రేక్షకులు ఓన్ చేసుకోగలిగారు కానీ, తెలుగులో మాత్రం ఈ సినిమాకి సరైన స్పందన రాలేదు. ఈ కాన్సెప్ట్, అందులోని పాత్రలు మన జనాలకు అర్థం కాలేదు. తమిళ వాసులు కూడా నేటివిటీ వల్ల... ఈ సినిమాని ఓన్ చేసుకొన్నారు కానీ, వాళ్ల అంచనాల్నీ అందుకోలేకపోయింది.
ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందించాడు మణిరత్నం. ఎప్పుడైనా సరే, పార్ట్ 1 హిట్టయితేనే పార్ట్ 2పై ఆసక్తి పెరుగుతుంది. బాహుబలి, కేజీఎఫ్‌ల విషయంలో అదే జరిగింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఫలితం చూశాక.. పార్ట్ 2పై ఆసక్తి ఉంటుందా? ఈ మాత్రం బజ్ అయినా వస్తుందా? అనేది అనుమానంగా మారింది. పైగా.. పార్ట్ 2 చూడాలన్న కోరిక, కుతూహలం కలిగించడంలో మణిరత్నం విఫలం అయ్యాడు. కాకపోతే.. పార్ట్ 2 ఆగడానికి వీల్లేదు.
పార్ట్ 1తో పాటు పార్ట్ 2 షూటింగ్ కూడా సమాంతరంగా జరిగిపోయింది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయితే చాలు. కాబట్టి.. పార్ట్ 2ని కచ్చితంగా విడుదల చేయాల్సిందే. కానీ.. విడుదలైనా దానికి ఓపెనింగ్స్ వస్తాయా? ఇంత బజ్ ఏర్పడుతుందా? జనం మాట్లాడుకొంటారా? అనేది అనుమానమే. పార్ట్ 2 షూటింగ్ మొదలెట్టకపోతే.. మణిరత్నం ఈ సినిమాని కొనసాగించాలన్న ఆలోచనే చేయడేమో..?