పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి ‘వకీల్‌సాబ్’ కాగా, ఇంకొకటి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. ఈ రెండూ ఇప్పుడు నిర్మాణ దశలో వున్నాయి. ‘వకీల్ సాబ్’ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ లేకపోయి వుంటే, ‘వకీల్ సాబ్’ రిలీజ్ గురించి బీభత్సమైన హంగామా జరుగుతుండేదిప్పుడు. ఇదిలా వుంటే, హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం విదితమే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
అయితే, ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. వచ్చే ఏడాది మొదటి క్వార్టర్‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళొచ్చంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. కానీ, దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా ముందుగానే సినిమా షూటింగ్ పనులు ప్రారంభించేయాలని అనుకుంటున్నాడట. లాక్‌డౌన్ ఎత్తివేసిన వెంటనే పవన్ - హరీష్ మధ్య చర్చలు జరగనున్నాయి. పవన్ డేట్స్‌కి అనుగుణంగా షూటింగ్‌ని ప్లాన్ చేయబోతున్నాడు హరీష్ శంకర్. ఇప్పటికే సినిమాకి సంబంధించి అన్ని విషయాలమీద స్పష్టత ఇచ్చే ప్రయత్నంలో బిజీగా వున్నాడు దర్శకుడు. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్‌ని కూడా ఖరారు చేశాడు. త్వరలోనే హీరోయిన్ ఎవరన్నదానిపై క్లారిటీ ఇవ్వబోతున్నారట. తమ కాంబో విషయమై దుష్ప్రచారం జరుగుతుండడం బాధాకరమంటున్న ఈ దర్శకుడు, పవన్‌తో ఎప్పుడు సినిమా తీసినా అది తనకు అత్యంత ప్రతిష్టాత్మకమేనని చెబుతున్నాడు.