ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) కన్నుమూశారు. ఈరోజు ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆయన స్వస్థలం. పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన సుమారు 2600 చిత్రాలకు పబ్లిసిటీ డిజైన్స్ అందించారు. బాపు దర్శకత్వం వహించిన 'సాక్షి' (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ ప్రయాణం ప్రారంభమైంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'దేవుళ్ళు' ఆయన పని చేసిన ఆఖరి చిత్రం. ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. దాదాపు ప్రతీ దర్శకుడు, ప్రతీ నిర్మాత, ప్రతీ హీరోతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. మరీ ముఖ్యంగా బాపు - రమణలకు ఇష్టుడు. పబ్లిసిటీ డిజైన్ రంగంలో ఆయన ఓ ద్రోణాచార్య.