పునర్నవి భూపాలం.. ఒక్కసారిగా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వరా అనూహ్యమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవి మధ్య బిగ్ హౌస్ రొమాన్స్ ఇందుకు కారణం కావొచ్చు. రొమాన్స్ అంటే ఇంకేదో అనుకునేరు.. అదో కెమిస్ట్రీ అంతే. కాస్త ఘాటైన స్నేహమది. బిగ్ బాస్ రియాల్టీ షోలో అదొక భాగం అంతే. అంతకు మించి రాహుల్ కీ తనకీ మధ్య ఎలాంటి వేరే సంబంధాలు లేవని పునర్నవి ఇప్పటికే స్పష్టం చేసింది. రాహుల్ కూడా పునర్నవి తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని చెప్పాడు పలు సందర్భాల్లో. అవన్నీ పక్కన పెడితే, బిగ్ బాస్ తనకు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందంటున్న పునర్నవి, ప్రస్తుతం కొన్ని సినిమాలతోపాటు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నట్ల చెప్పింది.
రియల్ లైఫ్ విషయానికొస్తే, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని సీక్రెట్స్ అలాగే వుంటాయనీ, వాటిని బయటకు చెప్పలేననీ పునర్నవి ఓ ప్రశ్నకు బదులిచ్చింది. పెళ్ళి ఆలోచనలేవీ ఇప్పట్లో ఈ భామ పెట్టుకోవడంలేదట. 6-7 సంవత్సరాల తర్వాత పెళ్ళి గురించిన ఆలోచనలు చేస్తుందట. కెరీర్ జాగ్రత్తగా చూసుకోవడంతోపాటుగా, చదువుకుంటానని పునర్నవి చెప్పింది. బిగ్ బాస్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ, అదొక అందమైన అనుభూతి అనీ, అక్కడి పరిస్థితులు వేరే వుంటాయనీ, తాను ఆ షో ద్వారా చాలా నేర్చుకున్నాననీ మంచి స్నేహితులు తనకు దొరికారనీ చెప్పుకొచ్చింది.