కరోనా వైపరీత్యం నుంచి ప్రజల్ని కాపాడడానికి, తమ వంతు సాయం అందించడానికి స్టార్లు చాలామంది బయటకు వచ్చారు. లక్షల్లో, కోట్లలో విరాళాలు అందించారు. హీరోయిన్లు ముందు కాస్త బద్దకించినా, మెల్లమెల్లగా వాళ్లూ కదులుతున్నారు. హాస్య నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నిర్మాతలూ, దర్శకులు తలో చేయీ వేస్తున్నారు. అయితే రచయితల నుంచి మాత్రం ఎలాంటి సాయం లభించలేదు. సినిమాల్లో భారీ నీతి వాక్యాలు రాస్తూ, లక్షల్లో పారితోషికాలు అందుకుంటూ.. ఇలా ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు ఆదుకోకపోవడం - విస్మయపరుస్తోంది.
అయితే.. వీళ్లమధ్య బుర్రా సాయిమాధవ్ తన ప్రత్యేకతని చాటుకున్నారు. తన సేవాదృక్పథంతో ఆకట్టుకుంటున్నారు. ఆయన స్వగ్రామం తెనాలి. కళలకు, కళాకారులకు తెనాలి పుట్టినిల్లు. తెనాలిలో కళళ కాణాచి అనే సేవా సంస్థని స్థాపించారు బుర్రా సాయిమాధవ్. ఈ సేవా సంస్థ తరపున ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 200 కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల్ని అందించారు. చిత్రసీమ వల్ల పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన మిగిలిన రచయితలూ కనీసం తమ గ్రామం కోసమైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే కళామతల్లి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది.