2000 సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోల పాత్ర రూపకల్పనకు సంబంధించి ఒక కీలక మలుపు వచ్చిన సంవత్సరమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఏడే పూరి జగన్నాధ్ రచయత-దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు.
తాను తెరవెనుక ఉంటూ తెర ముందు కనపడే హీరోల పాత్రలకి ఒక విరుపు,చిలిపి,బలుపు అనే కొత్తరకమైన (ఎందుకంటే అప్పటివరకు హీరోల పాత్రలలో ఇవి అంతగా కనపడేవి కావు) అదనపు హంగులని అద్ది వారికి తెరపైన పూరి మార్కు హీరోలుగా పరిచయం చేసేశాడు.
ముఖ్యంగా ఇతని మార్కు రైటింగ్ తో స్టార్ స్టేటస్ అందుకున్న రవితేజనే ఇందుకు ‘బ్లాక్ బస్టర్’ ఉదాహరణ. తన 17 ఏళ్ళ కెరీర్ లో హిట్స్ తో ఎంత మంచి పేరు మూటగట్టుకున్నాడో అదే స్థాయిలో ఫ్లాపులతో అంత చెడ్డ పేరుని మూటగట్టుకున్నాడు పూరి. దాదాపు ముప్పై పైగా చిత్రాల ప్రయాణం తరువాత పూరి కాస్త దర్శకుడిగా తగ్గిపోయాడు అన్న వార్తలు వినపడుతున్నా ఒక రచయతగా అందులోను తను రాసే సంభాషణల పరంగా ఇంకా తనలోని పదును ఎక్కడా తగ్గలేదు అన్నది నిర్వివాదాంశం.
తన సంభాషణల్లో హాస్యం ఎంత ఉంటుందో జీవితం గురించే చెప్పే పాఠాలు చాలానే ఉంటాయి. “జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తది” “ ఈ ప్రపంచంలో అందరు స్వార్ధపరులే.. కాని ఈ మాట చెప్తే.. ఏ ఎదవా ఒప్పుకోడు” వంటి పదునైన మాటలతో మీకు తెలియకుండానే ప్రశ్నిస్తుంటాడు.
తన సినిమాల టైటిల్స్ తో యువతని పెడదారి పట్టేలా చేస్తున్నాడు అంటూ ఆరోపించినా తనకు తెలిసింది వచ్చింది ‘సినిమా సినిమా సినిమా’ అంటూ ముందుకి వెళుతున్న రచయత-దర్శకుడైన పూరి జగన్నాధ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఇక తెరపైన హీరోలకి ఒక కొత్త తరహ హీరోయిజాన్ని తన పదునైన రాతలతో అద్దిన పూరి భవిష్యత్తులో హీరోయిజాన్ని మరింతగా ఆకర్షణీయంగా మలుస్తాడు అని ఆశిస్తూ ఓ సగటు అభిమాని..