చిరంజీవి `గాడ్ ఫాదర్`లో మరో ప్రత్యేక ఆకర్షణ చేరింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డేరింగ్, డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా అడుగుపెట్టేశారు. గాడ్ ఫాదర్‌లో పూరి ఓ అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఈరోజే ఆయన గాడ్ ఫాదర్ సెట్ కి వచ్చారు. ``నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండి తెర పైన నటుడిగా వెలుగు వెలగాలని, హైదరాబాద్ వచ్చాడు.
ఒకటీ అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా. అందుకే ఇంట్రడ్యూసింగ్ మై.. పూరి జగన్నాథ్... ఇన్ ఏ స్పెషల్ రోల్...`` అంటూ పూరిని ఆహ్వానం పలుకుతూ చిరు ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జైలు సెటప్‌లో.. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరు ఖైదీ దుస్తుల్లో ఉన్నారు. ఈసినిమాలో పూరి పాత్రేమిటి అనేది ఇంకా తెలియలేదు. ఆయన జర్నలిస్టుగా కనిపిస్తారని మాత్రం సమాచారం అందుతోంది. చిరుతో ఓ సినిమా చేయాలన్నది పూరి కోరిక. అయితే అది ఈ రూపంలో తీరబోతోందన్నమాట.