మహేష్ బాబుని స్టార్ నుంచి సూపర్ స్టార్ గా మలచిన సినిమా `పోకిరి`. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ పోకిరి తుడిచి పెట్టేసింది. హీరోయిజంపై, కథ నిచెప్పే విధానంపై ఈ సినిమా చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. పోకిరి ఎఫెక్ట్ చిత్రసీమపై కనీసం నాలుగైదేళ్లు ఉంది. పోకిరిలాంటి కథలు, అలాంటి పాత్రలు చాలా పుట్టుకొచ్చాయి. మహేష్ - పూరి బాండింగ్ ఆ సినిమాతో మొదలైంది. `బిజినెస్‌మెన్` పోకిరి అంత హిట్ కాలేదు గానీ, బ్యాడ్ సినిమా ఏం కాదు. ఆ తరవాత.. పూరితో మహేష్ సినిమా రాలేదు.
మధ్యలో ఓ ప్రయత్నం జరిగినా అది వర్కవుట్ కాలేదు. పూరి కలల ప్రాజెక్టు జనగనమణ మహేష్‌తో చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ సినిమా విషయంలోనే పూరికి, మహేష్‌కీ గ్యాప్ వచ్చింది. మహేష్ ప్రవర్తించిన విధానం పూరిని బాగా హర్ట్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో సైతం పూరి ఈ విషయాన్ని బయటపెట్టాడు. మహేష్ తో మళ్లీ సినిమా చేయకూడదన్నంత కసి పూరిలో కనిపించింది. అయితే ఇప్పుడు పూరికి మహేష్, మహేష్‌కి పూరి.. దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్‌తో పూరి ఓ సూపర్ హిట్టు కొట్టాడు. ఇప్పుడు విజయ్ తో సినిమా చేస్తున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్లు ఎన్ని కొట్టినా, మహేష్ లాంటి స్టార్ హీరో తో సినిమా చేసినప్పుడు వచ్చిన కిక్ ఉండదు. అలాంటి కిక్ ని పూరి కోరుకుంటున్నాడు. అతి త్వరలో మహేష్ తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. మహేష్ కూడా జరిగినవన్నీ మర్చిపోయి పూరితో కమిట్ అవ్వాలనుకుంటున్నాడు. అన్నీ కుదిరితే జనగనమణనే మళ్లీ తెరపైకి రావొచ్చు. 2021లో ఈ ప్రాజెక్టుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.