నాగార్జున తో సినిమా అంటే అగ్ర దర్శకులు వెనుకంజ వేస్తున్న రోజులివి. నాగార్జున హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. పైగా ఈమధ్య వచ్చిన ఆఫీసర్, మన్మథుడు 2 డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈ దశలో.. పూరితో నాగ్ కాంబో కుదిరింది అన్నమాట.... నాగ్ అభిమానుల్ని సంతోష పెడుతున్నా, మిగిలినవాళ్లకు మింగుడు పడడం లేదు. సూపర్, శివమణి.. నాగ్, పూరి కాంబోలో వచ్చినవే. రెండూ అంతంతమాత్రంగానే ఆడాయి. పూరి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్‌తో మంచి హిట్టు కొట్టాడు.
ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఇలా.. యంగ్ హీరోలతో సినిమాలు సెట్ చేసుకుని, కెరీర్‌ని పరుగులు పెట్టిస్తున్న తరుణంలో... నాగ్ తో సినిమా చేయడం పూరీకే రిస్కు. కాకపోతే... ఈ కాంబోపై తప్పకుండా అంచనాలు ఏర్పడతాయి. ఫామ్ లో ఉన్న పూరి.. నాగార్జునకు ఓ హిట్టు ఇవ్వకపోతాడా... అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తోంటే, ఫామ్ లో ఉన్నవాళ్లతోనే పూరి సినిమాలు చేసుకోవొచ్చు కదా.. అని పూరీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పూరి అంతే. ఎప్పుడు ఏ కాంబో సెట్ చేస్తాడో ఎవరికీ తెలీదు.