యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ దేవరకొండ ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. రౌడీ వేర్ బ్రాండ్ తో రెడీమేడ్ దుస్తుల రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దుస్తుల వ్యాపారమే కాకుండా విజయ్ దేవరకొండ కింగ్ అఫ్ ది హిల్ బ్యానర్ పై సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా తన సొంత బ్యానర్ పై ఒక వెబ్ సిరీస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తారని, ఇప్పటికే ఈ ప్రాజెక్టు దాదాపుగా ఫైనలైజ్ అయిందని సమాచారం అందుతోంది.
ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అనే చిత్రంతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర విజయం సాధించలేదు కానీ ఆనంద్ నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిన వెబ్ సిరీస్ లో నటించడం ద్వారా ప్రేక్షకులకు ఆనంద్ మరింతగా చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఆనంద్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన రెండవ చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే చిత్రంలో నటిస్తున్నారు. సినిమా దాదాపు చివరి దశకు చేరుకుందని, ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అన్నయ్య ప్రొడక్షన్ లో నిర్మించనున్న వెబ్ సిరీస్ లో నటిస్తారని అంటున్నారు.