అనుష్క పెళ్లి గురించి మాట్లాడుకోని వాళ్లు ఉండరేమో..? అనుష్క ఎప్పుడు కనిపించినా, పెళ్లెప్పుడు చేసుకుంటుందో... అనే ప్రశ్న ఉదయించకమానదు. అనుష్క పెళ్లి గురించి చాలా హాట్ స్టోరీలు వండేసింది మీడియా. అవి ఎప్పుడో చల్లారిపోయాయి కూడా. అనుష్క పెళ్లి గురించి ఇప్పుడు ఎవరేం మాట్లాడుకున్నా, అందులో వింతలూ, విడ్డూరాలూ కనిపించవు. ఎందుకంటే.. తన పెళ్లి గురించి ఎంత మాట్లాడాలో అంతా మాట్లాడేశారు. ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్లి టాపిక్ వచ్చింది. అనుష్క చిత్రసీమలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా `నిశ్శబ్దం`టీమ్ ఓ ఈవెంట్ ఏర్పాటు చేసింది.
ఇందులో అనుష్కతో సినిమాలు తీసిన దర్శకులంతా వచ్చారు. ఈ సందర్భంగా అనుష్క పెళ్లి టాపిక్ వచ్చింది. అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని ఛార్మి సరదాగా అడిగితే... అదెప్పుడో నాకూ తెలీదు అంటూ తప్పించుకోవాలని చూసింది స్వీటీ. అంతలోనే పూరి మైకు అందుకుని `హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే మా దర్శకులకు నచ్చదు` అంటూ కౌంటరేశాడు. దాంతో అక్కడున్నవాళ్లంతా నవ్వేశారు. అనుష్క పెళ్లి చేసుకుంటే దర్శకులకు వచ్చిన ఇబ్బందేమిటో? అంటూ గుసగుసలూ వినిపించాయి. మొత్తానికి పూరి తనదైన శైలిలో ఓ పంచ్ వేసినా.. పెళ్లి విషయంలో పూరి నోరు జారాడేమో అనిపించింది. పూరి కామెంట్ ప్రస్తుతం దర్శకుల మైండ్ సెట్ ని బయటపెడుతుంది. పెళ్లి చేసుకున్న హీరోయిన్లతో పనిచేయడానికి దర్శకులు, హీరోలూ అంతగా మొగ్గు చూపరు. రేపు అనుష్క విషయంలోనూ అంతేనేమో..?