నటీనటులు : త్రిష్నా ముఖర్జీ, రాహుల్, అనీష్ తదితరులు
దర్శకత్వం : శ్రీవిద్య బసవ
నిర్మాతలు : ఇందిరా బసవ
సంగీతం : నరేశ్ కుమరన్
సినిమాటోగ్రఫర్ : అభిరాజ్ నాయర్
ఎడిటర్: రంజిత్ టచ్‌రివర్
రేటింగ్: 2.5/5
తెలుగు చిత్రసీమలో మహిళా దర్శకులు చాలా తక్కువ. ఉన్నా... అప్పుడప్పుడు మాత్రమే మెరుస్తున్నారు. కొత్తగా మెగాఫోన్ పట్టుకోవాలని చూస్తున్న చాలామందికి అవకాశాలు దొరకడం లేదు. వాళ్లెప్పుడూ ససున్నితమైన కథా చిత్రాలూ, లవ్ స్టోరీలే తీస్తారని, రెగ్యులర్ మాస్, కమర్షియల్ కథల గురించి ఆలోచించరనే ఓ అపవాదు కూడా ఉంది. అది నిజం కూడా. అయితే ఈ ముద్రని చెరిపివేసే ప్రయత్నం చేసిన చిత్రం `మధ`. ఈ సినిమాతోనే శ్రీవిద్య అనే అమ్మాయి దర్శకత్వం వైపు అడుగులేసింది. ఇదో థ్రిల్లర్ కథాంశం. ఆ లెక్కన మహిళా దర్శకులు టచ్ చేయని జోనర్ అనుకోవాలి. మరి ఈ ప్రయత్నంలో శ్రీవిద్య ఎంత వరకూ విజయవంతమైంది? ఈ సినిమా ఏ వర్గానికి నచ్చుతుంది?
* కథ
నిషా (త్రిష ముఖర్జీ) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటుంది. అదే ఆఫీసులో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న అర్జున్ (వెంకట్ రాహుల్) ని ప్రేమిస్తుంది. అయితే అనుకోకుండా నిషా ప్రవర్తన వింతగా మారిపోతుంది. అనవసరమైన విషయాలకు భయపడడం, విచిత్రంగా ప్రవర్తించడం షాక్‌కి గురి చేస్తుంది. దాంతో ఆమెను మెంటల్ హాస్పిటల్‌లో చేరుస్తారు. అక్కడకు వెళ్లాక... నిషా పిచ్చి మరింతగా ముదురుతుంది. అక్కడి నుంచి పారిపోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటుంది. నిషా ఇలా మారడానికి కారణమేంటి? ఆమె విషయంలో ఏం జరిగింది? తనని వెంటాడుతున్న ప్రమాదం ఏమిటి? అందులోంచి ఎలా బయటపడింది? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
* విశ్లేషణ
ఓ మహిళా దర్శకురాలు ఈ జోనర్ లో ఓ కథని ఎంచుకోవడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఈ విషయంలో శ్రీవిద్యని మెచ్చుకుని తీరాల్సిందే. సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలకు సరిపడా స్టఫ్ ఈ కథలో ఉంది. దాన్ని తగిన రీతిలోనే తెరపైకి తీసుకొచ్చింది చిత్రబృందం. ఇలాంటి కథలకు టేకాఫ్ చాలా ముఖ్యం. నేరుగా కథలోకి వెళ్లిపోతే... సినిమా త్వరగా ముగింపుకు వచ్చేసిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు విషయంలోకి వెళ్లడం ఆలస్యం చేస్తే... అసలు కంటే కొసరు ఎక్కువై బోర్ ఫీలవుతాడు ప్రేక్షకుడు.
శ్రీవిద్య కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకుంది. దాంతో ఈ కథతో ఏం చెప్పదలచుకున్నారా? అనే అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది. ఎప్పుడైతే నిషా వింతగా ప్రవర్తించడం మొదలెడుతుందో.. అక్కడ టేకాఫ్ దొరికినట్టైంది. అక్కడి నుంచి కథనం వేగంగానే సాగుతుంది. చాలా కీలకమైన ద్వితీయార్థాన్ని పట్టుగానే తీశారు. అక్కడక్కడక స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంటుంది. కానీ.. ఎక్కడ ఎలాంటి టర్న్ ఇస్తే కథకు న్యాయం జరుగుతుందో, ఎక్కడ ఉత్కంఠత స్థాయి పెంచాలో అక్కడ పెంచుతూ... పతాక సన్నివేశాల వరకూ నడిపించగలిగారు.
చాలా తక్కువ పాత్రల చుట్టూ నడిచే కథ ఇది. పరిమిత పాత్రల మధ్య దాదాపుగా మూడు నాలుగు లొకేషన్ల మధ్య ఈ కథని నడపడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ... శ్రీవిద్య ఆ పనిలో విజయవతంమైంది. అనవసరమైన సన్నివేశాలు, స్లో నేరేషన్‌తో థ్రిల్ తగ్గుతుంటుంది. కాస్త అనుభవం వస్తే... ఇలాంటి విషయాల్లో పట్టు సాధించొచ్చు. ట్విస్టు రివీల్ చేసిన పద్ధతి బాగున్నా - కొన్ని చోట్ల తపబడడంతో అనుకున్న హై ఇవ్వలేకపోయింది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కి ఈ సినిమా కొంత మేర నచ్చొచ్చు.
* నటీనటులు
చాలా పరిమితమైన పాత్రలతో రూపొందించిన చిత్రమిది. కాస్టింగ్ సరిగానే కుదిరింది. త్రిషముఖర్జీ బరువైన పాత్రని మోయగలిగింది గానీ, ఆ స్థానంలో పేరున్న కథానాయిక కనిపిస్తే ఈ సినిమా కలర్ మారిపోదును. వెంకట్ రాహుల్ కి నటించే అవకాశం దక్కలేదు. ఆశీష్ కురువిల్లా ఓ కే అనిపిస్తాడు.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది. సౌండ్ క్వాలిటీ, ఎడిటింగ్ విభాగాల్లో నేర్పు కనిపించింది. అయితే బడ్జెట్ లోటు పాట్లు అర్థమయ్యాయి. చాలా చోట్ల ఆ పరిమితులు కనిపిస్తాయి. స్క్రిప్టు పరంగా పెద్ద తప్పులేం లేవు. కొన్ని చోట్ల దర్శకురాలి పనితనం కనిపిస్తుంది. అయితే.. ఇంకొన్ని చోట్ల ఆమె అనుభవం తక్కువన్న విషయం అర్థమవుతూ ఉంటుంది. ఇంకొంత హోం వర్క్ చేసి, స్టార్ బలం తోడై, బడ్జెట్ ఇవ్వగలిగితే... ఈసినిమా మరింత నాణ్యంగా తయారయ్యేది.
* ప్లస్ పాయింట్
ప్రధాన పాత్రధారుల నటన
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
టెక్నికల్ టీమ్
* మైనస్ పాయింట్స్
స్టార్ లేకపోవడం
స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: మరింత మధనం జరగాల్సింది