అగ్ర దర్శకులలో పూరి జగన్నాథ్ స్టైల్ పూర్తిగా వేరు. ప్రతీ దర్శకుడు కథ గురించి, మేకింగ్ గురించి నెలల తరబడి ఖర్చు పెడతారు. ఓ కథని లాక్ చేయాలంటే కనీసం ఆరు నెలలు, సినిమా పూర్తి చేయాలంటే ఏడాది తప్పని సరి. కానీ పూరి అలా కాదు. వారంలో స్క్రిప్టు పూర్తి చేయగలడ సమర్థుడు. రెండు నెలల్లో సినిమా పూర్తి చేసేస్తాడు. అందులో ఎంత పెద్ద స్టార్ ఉన్నాసరే. ఈ స్పీడు విషయంలో పూరితో ఎవ్వరూ పోటీ పడలేరు. కానీ.. ఇప్పుడు ఈ పంథాని మార్చుకోవాలనుకుంటున్నాడట పూరి. త్వరత్వరగా సినిమాలు తీసేసే విధానానికి పూరి పుల్ స్టాప్ పెట్టేయబోతున్నాడు. ఈ విషయం పూరినే చెప్పాడు.
''నేను చాలా ఫాస్ట్ గా సినిమాలు తీస్తాను. కానీ `లైగర్` కాస్త లేటయ్యింది. దాంతో పాటు క్వాలిటీ పెరిగింది. ఇక నుంచి...తొందర తొందరగా సినిమా పూర్తి చేసే విధానాన్ని పక్కన పెడతాను. స్క్రిప్టుకీ, మేకింగ్ కీ కాస్త టైమ్ తీసుకోవాలనుకుంటున్నాడు. దాని వల్ల క్వాలిటీ పెరుగుతుందని నా ఫీలింగ్'' అని చెప్పుకొచ్చాడు పూరి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా `లైగర్` చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఛార్మి, కరణ్ జోహార్‌లతో కలిసి పూరి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈనెల 25న విడుదల అవుతోంది.