చిరంజీవి - పూరి జగన్నాథ్ అనగానే.. ఆటోజానీ గుర్తొస్తుంది. `రౌడీ అల్లుడు` లో చిరంజీవి డ్యూయల్ రోల్ చేశాడు. అందులో ఓ పాత్ర.. ఆటోజానీ. ఇదే టైటిల్ తో పూరి జగన్నాథ్ ఓ కథ రెడీ చేశాడు. చిరంజీవి 150వ సినిమా చేయాలనుకొన్నప్పుడు ఈ స్క్రిప్టు పట్టుకొని గట్టిగా ట్రై చేశాడు పూరి. చిరంజీవితో కొన్ని రోజుల పాటు డిస్కర్షన్ కూడా జరిగింది. కానీ ఎందుకనో.. పట్టాలెక్కలేదు. ఆ స్థానంలోనే ఖైది నెం 150ని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఆ తరవాతైనా ఆటోజానీ ఉంటుందేమో అనుకొన్నారు ఫ్యాన్స్ కానీ.. ఆ ప్రాజెక్టుకి మోక్షం దొరకలేదు. ఇక ఎప్పటికీ ఆటోజానీ అనే సినిమా రాదు. ఈ విషయాన్ని పూరినే స్వయంగా చెప్పాడు.
గాడ్ ఫాదర్ ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి - పూరి జగన్నాథ్ మధ్య సరదా చిట్ చాట్ సాగింది. ఈ సందర్భంగా ఆటోజానీ ని గుర్తు చేశాడు చిరు. ఆ సినిమా ఉందా? లేదా? అని పూరిని అడిగితే... `ఆ కథ పాతదైపోయింది. మీకోసం ఇంకా మంచి కథ రాస్తున్నా. త్వరలో మిమ్మల్ని కలుస్తా` అన్నాడు పూరి. చిరు కూడా... పూరిని స్వాగతించాడు. ఎప్పుడొచ్చినా కథ వినడానికి సిద్ధంగా ఉంటానని మాటిచ్చాడు. సో.. ఆటోజానీ ని ఫ్యాన్స్ మర్చిపోవొచ్చు. కాకపోతే... చిరంజీవి - పూరిల కాంబోకి మాత్రం ఇంకా తలుపులు తెరచే ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.