ఈ దసరాకి చిరంజీవి, నాగార్జున ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ పోరులో చిరుదే పై చేయి అయ్యింది. గాడ్ ఫాదర్ హిట్టయితే, ది ఘోస్ట్ డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇదే రకమైన పోరు చూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `వాల్తేరు వీరయ్య` సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. సంక్రాంతికి ఆదిపురుష్ కూడా వస్తోంది. అయితే ఇప్పుడు బాలయ్య సినిమా కూడా సంక్రాంతికే తీసుకురావాలనుకొంటున్నారట.
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ ఓ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేద్దామనుకొంటున్నారు. అయితే బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సంక్రాంతికి విడుదలైన బాలయ్య సినిమాలు దాదాపుగా హిట్టే. అందుకే `ఈ సినిమా కూడా సంక్రాంతికే విడుదల చేయండి` అని నిర్మాతలకు హుకూం జారీ చేశాడట బాలయ్య. ఆయన చెబితే తిరుగేముంది? కాకపోతే.. చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు కూడా వాళ్లే నిర్మాతలు. ఒకేసారి రెండు పెద్ద సినిమాల్ని విడుదల చేయడం ఎంతటి నిర్మాతకైనా కత్తి మీద సామే. అందుకే బాలయ్యకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి సినిమా సంక్రాంతికి రావడం పక్కా. బాలయ్య కూడా బరిలో దిగిపోతే.. ఇక ఆ పోరు రసవత్తరంగా మారడం ఖాయం.