మెగాస్టార్ చిరంజీవిని అభిమానించనివారెవరు? ఈ తరం యంగ్ డైరెక్టర్స్ కూడా ఇంకా చిరంజీవిని దృష్టిలోపెట్టుకుని కథల్ని తయారుచేసుకుంటూనే ఉన్నారు. అది సినీ రంగంపై చిరంజీవి వేసిన ముద్ర. కమర్షియల్ సినిమాకి అడ్రస్ చెప్పిన ఘనుడు మెగాస్టార్ చిరంజీవి. అలా చిరంజీవిని అభిమానించేవారిలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఒకరు. చిన్నప్పుడు చిరంజీవి సినిమా వస్తోందంటే థియేటర్ల వద్ద బ్యానర్ కట్టిన విషయాల్ని పూరి ఇప్పటికీ మర్చిపోలేడు. చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం పట్ల పూరి గతంలో కొంత ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే చిరంజీవితో ఎప్పటికైనా సినిమా చేస్తాననే పట్టుదల మాత్రం ఆయనలో తగ్గలేదు. చిరంజీవి సినిమాలకి బ్యానర్లు కట్టినోడ్ని నేను, ఆయన మీద అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనెలా ఉండాలని నేను కోరుకుంటున్నానో అలాంటి కథతో త్వరలో చిరంజీవిని ఒప్పిస్తాను, సినిమా చేస్తానంటూ తాజాగా తన కొత్త సినిమా 'రోగ్' ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పాడు పూరి. అభిమానులందు వీరాభిమానులు వేరయా అన్నట్లుగా చిరంజీవికి అశేషంగా ఉన్న వీరాభిమానుల్లో పూరి జగన్నాథ్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. అలాంటి వీరాభిమాని నుంచి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా ఎప్పుడొస్తుందో ఏమో!