అంతే.. సినిమా హిట్టయితే అన్నీ సవ్యంగా ఉంటాయి. పోతే గనుక... అప్పుడు మాటలు, చేతలు అన్నీ తేడా వచ్చేస్తాయి. పూరి - విజయ్ దేవరకొండల మధ్య అదే జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ యేడాది అతి పెద్ద డిజాస్టర్లలో ఇదొకటి. దాంతో వీరిద్దరి ప్లానింగులూ కూడా తేడా కొట్టేశాయి. లైగర్ 2 తీస్తానని విజయ్, పూరి ప్రకటించిన సంగతి తెలిసిందే. అది... ఎప్పుడో అటకెక్కేసింది. ఇప్పుడు వీరిద్దరి చేతిలో `జనగణమన` ఉంది. ఫస్ట్ షెడ్యూల్ ముగించుకొన్న ఈ సినిమా... త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభించుకోవాలి. `లైగర్` ఫ్లాప్ అవ్వగానే ఈ సినిమా షెడ్డుకి వెళ్లిపోతుందని అంతా ఊహించారు. అందులో భాగంగానే విజయ్ తొలి స్టెప్పు వేశాడు.
``జనగణమన షూటింగ్‌లో అప్పుడే పాల్గొనలేను. ముందు ఖుషి పూర్తవ్వాలి. తరవాత.. జనగణమన గురించి ఆలోచిద్దాం`` అని పూరికి చెప్పేశాడట విజయ్. దాంతో.. పూరి కూడా, జనగణమనకు బ్రేక్ ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ముంబైలో జనగణమనని లాంఛనంగా ప్రారంభించి కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. రూ.5 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. ఈసినిమాని ఇప్పుడే ఆపేస్తే 5 కోట్లు నష్టపోతారు. మరి.. ఆ 5 కోట్ల నష్టాన్ని భరించడానికి పూరి సిద్ధంగా ఉన్నాడా, లేదంటే సినిమా పూర్తి చేసి, ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో పనిచేస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి.