చియాన్ విక్రమ్ ఓ హిట్టు కొట్టి చాలా ఏళ్లయ్యింది. అపరిచితుడు తరవాత ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్టు అనేది అందని ద్రాక్షే అయ్యింది. ఈమధ్యే `మహాన్` అనే సినిమా చేశాడు. అది బాగానే ఉంది కానీ, ఓటీటీలో విడుదల అవ్వడం వల్ల హిట్ లో ఉన్న మజా... విక్రమ్ అనుభవించలేకపోయాడు.
ఇప్పుడు తన నుంచి మరో సినిమా వస్తోంది. అదే `కోబ్రా`. ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 10 గెటప్పుల్లో కనిపించనున్నాడు. ఈనెల 31న ఈ సినిమా విడుదల అవుతోంది. సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఈ సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాల 3 సెకన్లు. మూడు గంటల సినిమా అంటే మామూలు విషయం కాదు. ఎంత గొప్పగా ఉన్నా, అన్ని గంటలు కూర్చోబెట్టడం కష్టమే. పైగా ఈమధ్య రెండు గంటల సినిమాలకు ఎక్కువగా అలవాటు పడిపోయారు ప్రేక్షకులు.
రెండున్నర గంటలున్నా... భరించడం కష్టమైపోతోంది. అలాంటిది విక్రమ్ తన సినిమాని 3 గంటలు లాక్కొచ్చాడంటే చాలా సాహసమే అని చెప్పుకోవాలి. ఇందులో విక్రమ్ 10 గెటప్పుల్లో కనిపిస్తాడు. ఒకొక్క గెటప్‌లోనూ 10 నిమిషాలు కనిపించినా గంటన్నర సినిమా విక్రమ్ కే కేటాయించాలి. అందుకే... ఈ సినిమా నిడివి అలా పెరిగిపోయిందన్నమాట. ఈ సినిమాని మరో 30 నిమిషాలు కత్తిరించాలని చాలామంది విక్రమ్ కి సలహా ఇచ్చార్ట. కానీ విక్రమ్ పట్టించుకోలేదు. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో.. విక్రమ్ నిడివిని అలా వదిలేశాడు. మరి.. రిజల్ట్ ఎలా ఉంటుందో..?