స్టార్ హీరో సినిమా అంటే మాటలు కాదు. ముఖ్యంగా బడ్జెట్ ఎప్పుడూ కంట్రోల్ లో ఉండదు. ఓ అంకె అనుకుని సినిమా మొదలెడితే... దానికి రెట్టింపు తేలుతుంటుంది. `పుష్ష`కీ ఇదే సమస్య మొదలైందిప్పుడు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. మారేడుమల్లి అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. ఈసినిమా మొదలెట్టేటప్పుడు రూ.130 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కరోనా, లాక్ డౌన్.. వాటి వల్ల సినిమా ఆగిపోయింది. వడ్డీలు పెరిగాయి. బడ్జెట్ కూడా మారింది. ఆ తరవాత... 150 కోట్లలో సినిమా పూర్తి చేయాలనుకున్నారు. ఇప్పుడు మొత్తంగా 180 కోట్లు తేలుతోందట.
సుకుమార్ - బన్నీకలిసి దాదాపు 70 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు టాక్. పారితోషికమే కాదు, వాళ్లకు లాభాల్లోనూ వాటా ఇవ్వబోతున్నార్ట. దట్టమైన అడవుల్లో షూటింగ్ జరపాల్సిరావడం, ప్రతీరోజూ వందలాది మంది క్రూ సెట్లో ఉండడం, ఏకంగా తొమ్మిదిమంది విలన్లు ఈ సినిమాలో నటిస్తుండడం.. ఇలా ఎలా చూసినా... ఖర్చు భారీగానే తేలుతోంది. ఈ సినిమా 180 కోట్ల దగ్గరైనా ఆగుతుందా? లేదంటే 200 కోట్ల బడ్జెట్ దాటేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు. ఎందుకంటే సుకుమార్ పక్కా పర్‌ఫెక్షనిస్ట్. సినిమాని చెక్కుతూనే ఉంటాడు. ఈసారీ.. చెక్కుకుంటూ వెళ్తే.. 200 కోట్ల లెక్క తేలడం ఖాయం.