కరోనా భయాల నుంచి చిత్రసీమ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ముందు జాగ్రత్తలు తీసుకుని షూటింగులతు మొదలు పెడుతున్నారంతా. స్టార్ హీరోలూ.. మెల్లగా రంగంలోకి దిగుతున్నారు. దాంతో.. ఫిల్మ్‌నగర్‌లో పాత వైభవం కనిపించడం మొదలెట్టింది. అయితే.. ఇప్పుడు మళ్లీ షూటింగులకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం.... `పుష్ష`నే.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం `పుష్ష`. మారేడుమల్లి అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి కారణం కరోనా. యూనిట్ సభ్యుల్లో కొంతమందికి కరోనా సోకడంతో, ముందు జాగ్రత్త చర్యగా షూటింగ్ ని అర్థాంతరంగా ఆపేశార్ట. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఎవరికైనా సీరియస్ అయితే ఇప్పట్లో పుష్ష మళ్లీ సెట్స్‌పైకి వెళ్లడం కష్టమే.
ఈ పుష్ష ఎఫెక్ట్ మిగిలిన సినిమాల షూటింగులపై పడబోతోంది కూడా. ఎందుకంటే... `పుష్ష` షూటింగ్ లో కూడా ముందస్తు జాగ్రత్తలు బాగానే తీసుకున్నారు. అయినా సరే.. కరోనా విజృంభించింది. ఇప్పుడు మనకీ అలాంటి పరిస్థితే ఎదురైతే ఎలా? అనే టెన్షన్ పట్టుకుంది అందరికీ. అందుకే.. కొన్ని రోజుల పాటు షూటింగులు వాయిదా పడే అవకాశం ఉంది. అందులోనూ పెద్ద స్టార్లు ఇప్పుడు సెట్స్‌లోకి రావడానికి మరింతగా ఆలోచిస్తారు. ఈ భయాలన్నీ తొలగిపోవాలంటే.. వాక్సిన్ రావాల్సిందే. అదెప్పుడు వస్తుందో మరి.