పుష్షతో పెద్ద సినిమాల జాతర మళ్లీ మొదలు కాబోతోంది. RRR తరవాత అంత క్రేజ్ ఉన్న సినిమా ఇదే. పాన్ ఇండియా సినిమా, అందులోనూ అదిరిపోయే కాంబినేషన్ కావడంతో - అందరి దృష్టీ పుష్షపై పడింది. దానికి తగ్గట్టుగా ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటోంది చిత్రబృందం. ఏకంగా RRR కి పోటీగా పుష్ష ప్రమోషన్లు సాగడం విశేషం. ఈ రెండు సినిమాలూ ప్రమోషన్ల విషయంలో నువ్వా? నేనా? అన్నట్టు బాక్సాఫీసు దగ్గర పోటీ పడుతున్నాయి. నిజానికి రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ల విషయంలో పెద్దగా పట్టించుకోడు.
టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు విడుదల చేయడంలోనూ జాప్యం చూపిస్తుంటాడు. ఏం చేయకపోయినా, తన సినిమాకి ప్రమోషన్లు వస్తాయన్నది ఆయన ధీమా. కాకపోతే... RRR విషయంలో ఆయన మైండ్ సెట్ మారింది. ఈ సినిమాకి వీలున్నప్పుడల్లా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. అందుకు కారణం.. పుష్షనే. ప్రమోషన్ల విషయంలో ఓ రకంగా పుష్షనే ముందుంది. అందుకే RRR కూడా ప్రమోషన్లపై దృష్టి పెట్టక తప్పడం లేదు. RRR కి సంబంధించిన ఓ ఈవెంట్ ని దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇప్పుడు పుష్ష ప్రమోషన్లు సైతం దుబాయ్ లోనే చేయాలని నిర్ణయించుకున్నార్ట. టీమ్ మొత్తాన్ని దుబాయ్ తీసుకెళ్లి, అక్కడ గ్రాండ్ గా ఓ ఈవెంట్ చేయాలని రెండు సినిమాలూప్లాన్ చేస్తున్నాయి.
అయితే ఈ రెండు సినిమాల్లో ఎవరు ముందు దుబాయ్ వెళ్తే.. వాళ్లకు ఎక్కువ మైలేజీ వస్తుంది. డిసెంబరు 17న పుష్ష విడుదల కానుంది. 3 వారాల ముందే.. దుబాయ్లో ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కూడా అదే దిశగా అడుగులేస్తోందని టాక్. జనవరి 7న ఈ సినిమా రాబోతోంది. కాబట్టి.. ఈవెంట్ ని జనవరిలో ప్లాన్ చేస్తే చాలు.కానీ.. డిసెంబరులోనే (పుష్ష కంటే ముందుగా) ఓ ఈవెంట్ ని దుబాయ్లో చేయాలని ఫిక్సవుతున్నార్ట. అలా. పుష్షని ఓవర్ టేక్ చేయాలని చూస్తున్నారు. పుష్ష టీమ్ టీజరో, ట్రైలరో, లుక్కో విడుదల చేసేటప్పుడే.. ఆర్.ఆర్.ఆర్కి సంబంధించిన ప్రమోషన్ హడావుడి కనిపిస్తోంది. దీన్ని బట్టి.. ఈ రెండు సినిమాల ప్రమోషన్ స్ట్రాటజీ అర్థం చేసుకోవచ్చు.