బండ్ల గణేష్‌కి 'చిక్కడు దొరకడు' అనే టైటిల్ ఇచ్చారు ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్. అప్పు కావాలన్నప్పుడు కాళ్లా వేళ్లా పడుతుంటాడు. తీర్చాల్సి వచ్చేటప్పటికి చిక్కడు దొరకడు.. రేపంటాడు.. మాపంటాడు.. చెక్కులిస్తాడు. అవి పని చేయవు.. హి ఈజ్ ఛీటర్.. అంటూ ఆరోపిస్తున్నారు పొట్లూరి వర ప్రసాద్. వివాదాలతో సావాసం చేయడం బండ్ల గణేష్‌కి అలవాటే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటాడాయన.
ముక్కుసూటిగా మాట్లాడుతూ, కొంత మంది మెప్పు పొందినా, ఎక్కువ మందితో చీవాట్లు తినే రకం ఆయన. ఇటీవల రాజకీయాల్లోకి దూరి అక్కడ కూడా భంగ పడ్డాడు. అయితే, తాజాగా పీవీపీతో ఆయన వివాదం నెక్ట్స్ లెవల్‌కి చేరేలా కనిపిస్తోంది. అప్పు తీర్చమని అడిగితే, తన ఇంటి పైకి మనుషుల్ని పంపి బెదిరించాడంటూ పీవీపీ, బండ్ల గణేష్‌పై కేసు పెట్టారు. అయితే, ఆ కేసును పక్కదోవ పట్టిస్తూ బండ్ల గణేష్ వింత ధోరణితో ప్రవర్తిస్తున్నాడనీ తాజాగా పీవీపీ మీడియాతో చెప్పారు.
నాకే ఇలా చేశాడంటే, ఇంకెంత మందిని ఎంతలా ముంచేసి ఉంటాడో మీరే అర్ధం చేసుకోండి.. అంటూ పీవీపీ చెబుతున్నారు. ఇష్యూ సీరియస్‌నెస్‌ని బట్టి, ప్రస్తుతం బండ్ల పరిస్థితేంటీ.? ఆయన నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలోని ఆయన పాత్రకు చాలా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడనే టాక్ కూడా ఈ మధ్య బలంగా వినిపించిన సంగతి తెలిసిందే.