రాశి.. ఒకప్పుడు ట్రెడిషనల్ హీరోయిన్ పాత్రలకు పెట్టింది పేరు. బాల నటిగా అడుగుపెట్టి, హీరోయిన్ అయిపోయింది. శీను సినిమాలో ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. నిజంలో అయితే.. ఓ వ్యాంప్ పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఆ పాత్ర నేను చేయకుండా ఉండాల్సింది... అని చాలాసార్లు బాధపడింది. మరోసారి... `నిజం` సినిమా గుర్తు చేసుకుని `నేను చేయకుండా ఉండాల్సిన సినిమా అదే` అంటూ మళ్లీ ఫీలైంది.
ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో `నిజం` ప్రస్తావన మళ్లీ తీసుకొచ్చింది రాశీ. ఆ సినిమాలో తనది వ్యాంప్ పాత్ర అని ముందు చెప్పలేదని, గోపీచంద్ పక్కన హీరోయిన్ అన్నారని, అందుకే ఒప్పుకున్నానని, తీరా చూస్తే... వ్యాంప్ గా మార్చేశారని వాపోయింది. రెండ్రోజుల తరవాత.. షూటింగ్ నుంచి తప్పుకోవాలనిచూశానని, అయితే అలా అర్థాంతరంగా ఓ సినిమా నుంచి తప్పుకుంటే పరిశ్రమలో నెటిటీవ్ ఫీలింగ్ వస్తుందన్న భయంతో.. ఆ పాత్రని ఇష్టం లేకపోయినా చేయాల్సివచ్చిందని చెప్పుకొచ్చింది. కొంతమంది `బాగా నటించారు` అని కితాబు ఇచ్చినా, మరి కొంత మంది మాత్రం `అలాంటి పాత్రలు ఇంకెప్పుడూ చేయొద్ద`ని చెప్పార్ట. నాగబాబు అయితే రాశీకి ఫోన్ చేసి `కత్తిలా ఉన్నావ్` అని కాంప్లిమెంట్ ఇచ్చార్ట. అన్నట్టు ... `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రకూడా తన దగ్గరకే వచ్చిందని, చీరని మోకాళ్లపైకి కట్టడం తనకు ఇష్టం లేకపోవడం వల్ల, ఆ పాత్ర చేయలేదని చెప్పింది రాశీ. తాను చేయకపోవడం వల్లే.. ఆ పాత్ర అనసూయకు దక్కింది. అనసూయ విజృంభించి నటించడంతో... ఆమెకు మంచి పేరు వచ్చింది.