సినీ పరిశ్రమకు పండగ సీజన్ లే ముఖ్యం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మోగించాలంటే పండగ సీజన్ అయితేనే అది సాధ్యం అవుతుంది.. కాదనలేం, కానీ అన్ని సినిమాలు ఒకే పండుగను టార్గెట్ చేసుకుని ఒకేసారి రిలీజ్ అయితే ఉపయోగం ఏముంది ? ఆ పోటీలో ఖచ్చితంగా భారీ స్థాయిలో కలెక్షన్స్ రావు కదా. నిజానికి ఈ రోజుల్లో సినిమా హిట్ కి, ప్లాప్ కి.. సినిమా అవుట్ పుట్ తో పాటు ఆ సినిమా విడుదల సమయం కూడా ప్రధానంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన స్టార్ హీరోలు మాత్రం పోటీకే సై అంటున్నారు తప్ప.. తమ చిత్రాల విడుదల తేదీల మధ్య గ్యాప్ ఉండేలా మాత్రం ప్లాన్ చేసుకోవట్లేదు. అందుకు ఉదాహరణే. 2020 సంక్రాంతి పోరు.
మహేష్ బాబు, అల్లు అర్జున్ పోటీ పడి మరి సంక్రాంతి బెర్త్ ను ఖరారు చేసుకున్నారు, అదీ ఒక్క రోజు తేడాతో.. వాస్తవానికి మొదట ఒకే రోజు పోటీ పడాలనుకున్నారు, చివరికీ పెద్దల రాయభారాలతో ఒక్క రోజు తేడాతో రంగంలో దిగుతున్నారు. ఇక వీళ్ళతో పాటు సంక్రాంతి లైన్ లో రజినీకాంత్, కల్యాణ్ రామ్ లు కూడా ఉన్నారు. అలాగే వెంకటేష్ - నాగ చైతన్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోరే అన్నమాట.
సరే సంక్రాంతికి కాబట్టి సరిపెట్టుకోవచ్చు.. కానీ క్రిష్టమస్ కి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. బాలయ్య బాబు, సాయి ధరమ్ తేజ్ ఒకే రోజున డిసెంబర్ 20న బాక్సాఫీస్ వద్ద తమ బల ప్రదర్శన చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల పై కాస్త మంచి అంచనాలే ఉన్నాయి. ఒకే రోజు రిలీజ్ చేసి... వాటి కలెక్షన్స్ ను తగ్గించుకోవడం తప్ప సాధించేది ఏమి ఉండదు. అయినా డిసెంబర్ మొదటి మూడు వారాల్లో ఏ పెద్ద సినిమా లేదు. అన్ని చిన్న సినిమాలే. మరి ఈ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్ ను గ్యాప్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే.. కలెక్షన్స్ ఖచ్చితంగా కలిసొచ్చేవిగా. ఏంటో మంచి సినిమా తీయడంలో పోటీ పడాలి గాని, ఇలా సినిమా రిలీజ్ విషయంలో కాదని ఎప్పుడు అర్ధం అవుతుందో.. ఏమైనా పోటీ పడటంలో మనోళ్లు మారాలి.