మొన్నామధ్య నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమిళ సీనియర్ నటుడు రాధారవిపై వేటు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలి..' అని ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.
అయితే ఆయన ఇప్పుడు ప్లేట్ మార్చేశారు. తాజాగా ఓ షార్ట్ ఫిలిం ప్రమోషన్‌లో భాగంగా మరోసారి ఆయన బహిరంగ వేదికపై ఇదే ప్రస్థావన తీసుకొచ్చి రచ్చ చేశారు. ఎవరినైనా నొప్పించి ఉంటే.. అన్నాను కానీ, నేనేమీ నయనతారను క్షమించమని అడగలేదు. అయినా క్షమించమని అడగడం నా బ్లడ్‌లోనే లేదు, క్షమాపణలు కోరేంత తప్పు నేను చేయలేదు. నేను మాట్లాడినదంతా నిజమే. నిజం కాబట్టే ఆడియన్స్ నుండి చప్పట్లు కొట్టేలా రెస్పాన్స్ వచ్చింది.. అంటూ రాధా రవి మరోసారి సంచలనం సృష్టించారు. నయనతారనుద్దేశించి అప్పుడు ఆయన మాట్లాడిన మాటలను పలువురు సినీ ప్రముఖులు తప్పు పట్టారు. తమదైన శైలిలో స్పందించారు. అయితే తాజా వ్యాఖ్యలతో మరోసారి కథ మొదటికి వెళ్లినట్లైంది. అయినా ఆయన దేనికీ భయపడనంటున్నారు. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకపోతే, నాటకాలు వేసుకుంటాను.
కానీ తప్పు చేశానని అనవసరంగా ఒప్పుకోను.. అయినా ఇదో పెద్ద సమస్య అని నేను అనుకోవడం లేదు. నా మాటలు నచ్చినవారు చప్పట్లు కొడతారు. నచ్చనివారు వదిలేస్తారు అంతే..' అని ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాధారవి తాజా వ్యాఖ్యలు మరోసారి కోలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలకు దారి తీస్తాయో వేచి చూడాలిక.





 
 





 
  
  
  
  
  
  
  
  
					                 
                                


