యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే ఒక ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా లో ప్రభాస్ గురించి దర్శకుడు రాధాకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఓ ఇంగ్లీష్ డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ ప్రభాస్ ఈ సినిమాలో చూపించిన మార్పు గురించి చెప్పారు. ప్రభాస్ ఈ మధ్య నటించిన సినిమాలలో భారీ యాక్షన్ హీరోగా ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి యాక్షన్ హీరో ఈ సినిమాలో ఒక్కసారి గా లవర్ బాయ్ లాగా ఒదిగిపోయాడని కితాబిచ్చారు. తెరపై ప్రభాస్ చూపించే ఈ మార్పు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభాస్ ఈమధ్య నటించిన సినిమాలన్నింటిలో ఎక్కువగా యాక్షన్ హీరోగా కనిపించారు. చాలా ఏళ్ళ క్రితం 'డార్లింగ్' సినిమా లో మాత్రమే లవర్ బాయ్ పాత్రలో న్నటించారు. . ఇన్నేళ్ల తర్వాత ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ లో నటిస్తుండడం నిజంగానే ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది.
ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 1960ల నేపథ్యంలో జరిగే ప్రేమ కథ కావడంతో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు రెట్రో లుక్ లో ఉంటాయని, ఇద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా కుదిరిందని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.