ఈ సంక్రాంతి రేసు నుంచి ఆర్.ఆర్.ఆర్ తప్పుకోవడంతో.. రాధే శ్యామ్ ఒక్కడే మిగిలాడు. ఇక ఈ సంక్రాంతి అంతా... సోలో సినిమానే అనుకుంటున్న తరుణంలో.. చిన్న సినిమాలు వరుస కడుతున్నాయి. డిజే తిల్లు, హీరో, రౌడీ బోయ్స్.. ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నాయి. పైగా జనవరి 14, 15 తేదీల్ని టార్గెట్ చేసుకున్నాయి. జనవరి 14న రాధే శ్యామ్ వస్తోంది. అయినా సరే.. రిస్క్ చేస్తున్నారంటే, వాళ్ల నమ్మకం ఒక్కటే రాధేశ్యామ్ రాదని.
ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడైతే వాయిదా పడిందో, అప్పుడే... రాధే శ్యామ్ పై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఆర్.ఆర్.ఆర్‌లా.. రాధే శ్యామ్ కూడా పాన్ ఇండియా సినిమానే. నార్త్ లో లాక్ డౌన్, నైట్ కర్‌ఫ్యూ ప్రభావం రాధే శ్యామ్ పై కూడా ఉంది. అందుకే... రాధే శ్యామ్ తప్పకుండా వెనుకంజ వేస్తుందన్నది చిన్న సినిమా నిర్మాతల ధీమా.
కాకపోతే.. జవనరి 14న రావడం తప్ప రాధేశ్యామ్ కి మరో ఆప్షన్ లేదు. ఇప్పటి వరకూ ఈ సినిమాని హోల్డ్ చేయడమే యూవీకి గగనం అయిపోయింది. ఇప్పుడు దాటితే... వేసవికి విడుదల చేయాలి. అయితే వేసవిలో సలార్ ఉంది. సలార్ తో క్లాష్ రావడం కరెక్ట్ కాదు. 4 నెలలు సినిమాని చేతిలో ఉంచుకున్నా పరిస్థితులు చక్కబడతాయ్ అన్న నమ్మకం లేదు. అప్పుడు కూడా ఆర్.ఆర్.ఆర్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. ఈలోగా వడ్డీల భారం మోయాలి. అందుకే ఇప్పుడే ఈ సినిమాని విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన.
నార్త్ లో ధియేటర్లు తక్కువగా ఉన్న మాట వాస్తవం. ఉన్న ధియేటర్లలోనే ఎలాగోలా సర్దుకోవాలని రాధేశ్యామ్ భావిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ ఎలాగూ లేదు, హిందీ రిలీజులూ లేవు. కాబట్టి.. ఉన్న థియేటర్లన్నీ.. రాధే శ్యామ్ కే. పుష్ప ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే అక్కడ దాదాపు 50 కోట్లు చేసిందంటే.. ప్రభాస్ సినిమా కచ్చితంగా వంద కోట్లు అందుకుంటుంది. పైగా.... సాహో నార్త్ లో దాదాపుగా 250 కోట్లు చేసింది. అందులో సగం వచ్చినా హ్యాపీనే. నార్త్ లో ధియేటర్లు ఎక్కువగా టీ సిరీస్ చేతిలో ఉన్నాయి. కాబట్టి థియేటర్ల విషయంలో ఎలాంటి సమస్యా ఉండదు. సినిమా బాగుంటే తక్కువ థియేటర్లలో విడుదలైనా.. బాగానే క్యాష్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఏపీ, తెలంగాణలలో పరిస్థితులు ఇంకా చేయి దాటిపోలేదు. ఇక్కడ ఎలాంటి నిబంధనలూ లేవు. కాబట్టి... రాధే శ్యామ్ కి ఇదే సరైన సమయం.
జనవరి 10 తరవాత... థియేటర్ల లభ్యత, నైట్ కర్‌ఫ్యూ పై ఓ స్పష్టత వస్తుంది. అప్పటికి ఇప్పుడున్న పరిస్థితే ఉంటే ఓకే. ఇంకాస్త దిగజారితే, అప్పటికప్పుడు సినిమాని వాయిదా వేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. 10 తరవాత.. సినిమా రిలీజ్ తరవాత ఓ నిర్ణయానికి రావొచ్చు. ఈలోగా సినిమాని మెల్లమెల్లగా ప్రమోట్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది... రాధే శ్యామ్.