ప్రపంచం అంతా కరోనాతో అల్లాడిపోతోంది. మనదేశంలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆసుపత్రిలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ సిలెండర్లు లేక.. నానా కష్టాలూ పడుతున్నారు. కొంతమంది దాతలు ముందుకొచ్చి, తమ వంతు సహాయం చేస్తూ, ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిత్రసీమ కూడా ఆపదలో ఉన్నవాళ్లకు ఆపన్న హస్తం అందిస్తోంది. వైజాగ్ లోని రామానాయుడు స్టూడియోని కోవిడ్ పేషెంట్ల కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాధే శ్యామ్ టీమ్ కూడా ముందుకొచ్చి.. సేవాతత్పరత చాటుకుంటోంది.
ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా కోసం ఓ భారీ హాస్పిటల్ సెట్ వేశారు. ఆసుపత్రిలో ఉండాల్సిన సౌకర్యాలన్నీ పొందు పరిచారు. ఇప్పుడు ఈ సెట్ ప్రాపర్టీని కోవిడ్ పేషెంట్లకు ఇవ్వబోతున్నారు. దాదాపు 50 పడకలు, ఆక్సిజన్ సిలండర్లు, ఇతర సామాగ్రీ కోవిడ్ పేషెంట్ల కోసం కేటాయించబోతున్నార్ట. ఆ ఆసుపత్రికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది కాబట్టి.. చిత్రబృందానికి వాటితో పనిలేదు. వాటి అవసరం ఉన్న చాలామందికి... ఉపయోగపడేలా ఓ మంచి పనికి రాధే శ్యామ్ టీమ్ శ్రీకారం చుట్టడం నిజంగా మంచి విషయమే.