'తెలుగు సినిమా షూటింగ్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న మాట వాస్తవం. ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పాన్నేను. ఇందులో తప్పేమీ లేదు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు' అని అంటోంది 'రక్తచరిత్ర' ఫేం రాధికా ఆప్టే.
ఓ అగ్రహీరోతో సినిమా షూటింగ్ సందర్భంగా, తనను అసభ్యకరంగా ఆ అగ్రహీరో తాకాడంటూ సంచలన ఆరోపణలు చేసిన రాధికా ఆప్టే, ఆ అగ్ర హీరో పేరు చెప్పకపోవడంతో 'పబ్లిసిటీ స్టంట్ మాత్రమే' అన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. 'ఆ హీరో పేరు చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. నేనెదుర్కొన్న వేధింపుల గురించి మాత్రమే చెప్పాలనుకున్నాను, చెప్పాను' అని అంటోన్న రాధికా ఆప్టే, తెలుగు సినీ పరిశ్రమలో 'పురుషాధిక్యం' చాలా ఎక్కువని చెబుతూ, ఆ ఘటన తర్వాత ఆ అగ్ర హీరో తనకు క్షమాపణ చెప్పాడు గనుక, ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసేసింది.
మహిళలు వివిధ రంగాల్లో అవమానాలు, వేధింపుల్ని ఎదుర్కొంటున్నారనీ, అందులో లింగ వివక్ష కూడా ముఖ్యమైనదేనని అభిప్రాయపడుతోందామె. మహిళలే కాదు, కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా బాధితులేనని రాధికా ఆప్టే చెప్పింది. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న వివక్ష, తనకు ఎదురైన వేధింపుల సందర్భాల గురించి ప్రశ్నలు రావడంతో వాటికి సమాధానాలు ఇచ్చాను తప్ప, ఎవర్నో కించపర్చడానికీ, తన ఇమేజ్ పెంచుకోవడానికీ ఆ వ్యాఖ్యలు చేయలేదని రాధికా ఆప్టే క్లారిటీ ఇచ్చింది.
అయితే తెలుగు అగ్ర హీరోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాధికా ఆప్టే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం చాలా మంచోడని కితాబులివ్వడం గమనించాల్సిన విషయం.